
- ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలూమ్ని’ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
బషీర్‌బాగ్/ పద్మారావునగర్, వెలుగు: తెలంగాణను ‘ఇన్నొవేషన్ హబ్’ గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు వివరించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలూమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందన్నారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా మాత్రమే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
రీసెర్చ్ ను మార్కెట్‌కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. యునైటెడ్ యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఫార్మా సైన్స్ (యూయూపీఎస్) అలూమ్ని ఫార్మా విద్యార్థులకు సీనియర్లు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ వేడుకల్లో కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్ డి.రాంబాబు, ప్రభ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వేదం.. మన దేశానికి పునాది: శ్రీధర్ బాబు
వేదం.. మన దేశానికి పునాది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ పద్మారావునగర్‌లోని స్కందగిరిలో జనార్దన సరస్వతి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ వేద విద్వాన్ మహాసభలకు శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, మద్దులపల్లి మాణిక్య శాస్త్రి, చినజీయర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.