
- తొలి ఇన్నింగ్స్‌లో 387కే ఇండియా ఆలౌట్
- రాణించిన పంత్, జడేజా, నితీశ్
- 11 రన్స్ తేడాతో చివరి నాలుగు వికెట్లు డౌన్
లండన్: కేఎల్ రాహుల్ (177 బాల్స్‌లో 13 ఫోర్లతో 100) సెంచరీతో మెరిసినా.. రిషబ్ పంత్ (112 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), రవీంద్ర జడేజా (131 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 72) అండగా నిలిచినా.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఒక్క పరుగు ఆధిక్యం కూడా సాధించలేకపోయింది. ఓ దశలో 376/6తో మంచి ఆధిక్యం సాధించేలా కనిపించిన గిల్ సేన 11 రన్స్ తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ బౌలర్లు చివరి సెషన్‌లో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సమం చేసింది. 145/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 రన్స్‌కే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట ముగిసే టైమ్‌కు 1 ఓవర్ ఆడి 2/0 స్కోరు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్), డకెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పంత్ రనౌట్..
స్టార్టింగ్‌లో ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, పంత్ జాగ్రత్తగా ఆడారు. ఆర్చర్ ఫుల్ స్పీడ్‌తో బాల్‌ను ఇరువైపులా స్వింగ్ చేసినా ఈ ఇద్దరు ఏమాత్రం తడబడలేదు. లెగ్ సైడ్ ఫీల్డర్లు లేకపోవడంతో రాహుల్ బాల్‌ను స్లాష్ చేస్తూ సింగిల్స్ తీశాడు. తొలి అర్ధగంట ఈ ఇద్దరు నెమ్మదిగా ఆడటంతో ఏడు ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే వచ్చాయి. బ్యాటర్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యమివ్వడంతో బౌలర్లు కూడా వికెట్ల కోసం ప్రయత్నించలేదు. పంత్ గాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ ఎక్కువగా స్ట్రయిక్ తీసుకోవడంతో ఆర్చర్ బౌన్సర్లతో సవాల్ విసిరాడు. అయినా రాహుల్ క్లీన్‌గా వదిలేశాడు. తొలి గంట తర్వాత రాహుల్ బ్యాక్ ఫుట్ ఆటతో స్పీడ్ పెంచాడు. రెండో ఎండ్‌లో పంత్‌ను క్రీజు దాటకుండా వికెట్ కీపర్‌ను ముందుకు తీసుకొచ్చి స్టోక్స్ కొత్త స్ట్రాటజీని అమలు చేశాడు. కొద్దిసేపు వేచి చూసిన పంత్ బ్రేక్స్ మధ్య వేలి గాయానికి చికిత్స తీసుకుంటూనే తప్పని పరిస్థితుల్లో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో స్టోక్స్ బాల్‌ను ఫైన్ లెగ్‌లోకి పంపి 86 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. రెండో గంటలో బాల్‌ను మార్చడంతో ఇంగ్లండ్.. బ్రైడన్ కార్స్‌ను బౌలింగ్‌కు దించింది. అయినప్పటికీ రాహుల్ మంచి ఫుట్ వర్క్‌తో మూడు ఫోర్లు బాదాడు. ఆ వెంటనే బషీర్ బౌలింగ్‌లో పంత్ రెండో సిక్స్ కొట్టాడు. అప్పటి వరకు సాఫీగా సాగిన ఇన్నింగ్స్‌కు సెషన్ చివరి ఓవర్‌లో బ్రేక్ పడింది.రాహుల్ పిలుపుతో లేని పరుగు కోసం ప్రయత్నించిన పంత్‌ను కవర్స్ నుంచి స్టోక్స్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. నాలుగో వికెట్‌కు 141 పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో పాటు ఇండియా 248/4తో లంచ్‌కు వెళ్లింది.
రాహుల్ సెంచరీ..
98 రన్స్ వ్యక్తిగత స్కోరుతో రెండో సెషన్ మొదలుపెట్టిన రాహుల్ 67వ ఓవర్‌లో ఆర్చర్ బాల్‌ను కవర్స్‌లోకి నెట్టి సెంచరీ పూర్తి చేశాడు. కానీ బషీర్ వేసిన తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్‌కు చెత్త షాట్ ఆడి స్లిప్‌లో బ్రూక్‌కు దొరికిపోయాడు. ఈ ఫార్మాట్‌లో రాహుల్‌కు ఇది 10వ సెంచరీ కాగా, విదేశాల్లోనే 9 చేయడం విశేషం. ఇక జడేజాతో కలిసి నితీశ్ కుమార్ రెడ్డి (30) నిలకడగా ఆడాడు. మధ్యలో కొన్నిసార్లు లయ తప్పినా వికెట్‌ను మాత్రం కాపాడుకున్నాడు. 74వ ఓవర్‌లో జడేజా క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక్కడి నుంచి ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ముందుకెళ్లారు. 83వ ఓవర్‌లో నితీశ్ తొలి ఫోర్‌తో కుదురుకున్నాడు. బషీర్ చేతి వేలికి గాయం కావడంతో రెండు ఎండ్‌ల నుంచి వోక్స్, ఆర్చర్‌ను కొనసాగించారు. మధ్యలో స్టోక్స్ రాకతో ఎండ్‌లు మార్చి బౌలింగ్ చేసినా ప్రయోజనం దక్కలేదు. ఈ సెషన్‌లో 26.3 ఓవర్లలో 68 రన్స్ రావడంతో ఇండియా టీ బ్రేక్ వరకు 316/5 స్కోరుతో నిలిచింది. విరామం తర్వాత నాలుగో ఓవర్‌లోనే నితీశ్‌ను స్టోక్స్ ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 72 రన్స్ జతయ్యాయి. సుందర్ (23) నిలకడగా ఆడినా 87 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన జడేజాను 8 ఓవర్ల (114) తర్వాత వోక్స్ పెవిలియన్‌కు పంపడంతో ఏడో వికెట్‌కు 50 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇదే ఓవర్‌లో ఆకాశ్ దీప్ (7) రెండుసార్లు డీఆర్‌ఎస్ నుంచి బయటపడినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. వరుస విరామాల్లో ఆకాశ్‌తో పాటు బుమ్రా (0), సుందర్ ఔటయ్యారు. ఈ సెషన్‌లో 71 రన్స్ తేడాతో ఐదు వికెట్లు కోల్పోవడంతో జట్టుకు ఆధిక్యం దక్కలేదు.
సంక్షిప్త స్కోర్లు
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387 ఆలౌట్. ఇండియా తొలి ఇన్నింగ్స్: 112.3 ఓవర్లలో 387 ఆలౌట్ (రాహుల్ 100, పంత్ 74, జడేజా 72, వోక్స్ 3/84). ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 1 ఓవర్‌లో 2/0 (క్రాలీ 2 బ్యాటింగ్, డకెట్ 0 బ్యాటింగ్).
- టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ పంత్ (36). వివ్ రిచర్డ్స్ (34) రికార్డును బ్రేక్ చేశాడు.
- 2015 తర్వాత ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం కావడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ చెరో 350 స్కోరు చేశాయి.
- లార్డ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఇండియా రెండో బ్యాటర్ కేఎల్ రాహుల్. దిలీప్ వెంగ్‌సర్కార్ (3) ముందున్నాడు. ఓవరాల్‌గా 10 మంది ఇండియన్ బ్యాటర్లు లార్డ్స్‌లో సెంచరీలు నమోదు చేశారు.
- 8ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ (8) రికార్డును పంత్ సమం చేశాడు.