జైపూర్: ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్, బయో బబుల్ నేపథ్యంలో ఆటగాళ్లు అలసటకు గురవకుండా అన్ని జట్లూ చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు ప్లేయర్ల రొటేషన్ పాలసీ అమలు చేస్తున్నాయి. అలసిపోయిన క్రికెటర్లకు తగిన విశ్రాంతి ఇస్తున్నాయి. ఈ విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ మరో ముందడుగు వేయనుంది. ప్రస్తుతం ఇండియా టూర్‌లో ఉన్న ఆ జట్టు.. సరికొత్తగా ‘కెప్టెన్ రొటేషన్ పాలసీ’ అమలు చేయనుంది. ఇండియాతో జరిగే మూడు టీ20ల్లో ముగ్గురికి కెప్టెన్సీ అప్పగించాలని డిసైడైనట్టు సమాచారం. టెస్టులపై ఫోకస్ పెట్టేందుకు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటున్నాడు. అతని ప్లేస్‌లో టిమ్ సౌథీని కేవలం ఫస్ట్ టీ20కే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రెండో టీ20కి శాంట్నర్ లేదా బౌల్ట్ కెప్టెన్‌గా ఉంటాడని సమాచారం. మూడో మ్యాచ్‌లో మరొకరికి పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్లేయర్లంతా బాగా అలసిపోయారని, ఇండియాతో టెస్టు సిరీస్కు ముందు అందరికీ తగినంత రెస్ట్ ఇవ్వాలని కివీస్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
