AFG vs PAK: పాకిస్తాన్‌పై విజయం: తుపాకుల మోత మోగించిన తాలిబన్లు

AFG vs PAK:  పాకిస్తాన్‌పై విజయం: తుపాకుల మోత మోగించిన తాలిబన్లు

తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే ప్రపంచ కప్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. చిన్న జట్లు అనుకున్న ఆప్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ మేటి జట్లకు ఓటమి రుచి చూపిస్తున్నాయి. డచ్ ఆటగాళ్లు సఫారీ జట్టుపై విజయడంకా మోగిస్తే.. ఆఫ్ఘన్లు ఇంగ్లాండ్, పాకిస్తాన్‌కు తమ సత్తా చూపించారు. సోమవారం చెన్నై వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వారి దేశంలో సంబరాలు మిన్నంటాయి.

ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే అమెరికా సేనలు అక్కడినుండి వైదొలగారో అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ విజయం సాధించగానే వారు తమ స్టయిల్ లో సంబరాలు చేసుకున్నారు. సాధారణ పౌరులు బాణాసంచా కాలిస్తే.. వారు తుపాకుల మోత మోగించారు. ఆకాశం వైపు తుపాకీ గురిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమిష్టి విజయం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. చెన్నై స్లో పిచ్‌పై ఇది మంచి స్కోరే అయినప్పటికి.. ఆఫ్ఘన్ బ్యాటర్ల పోరాటం ముందు అది చిన్నబోయింది. ఆ జట్టు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87) హాఫ్ సెంచరీలతో విజయానికి మంచి పునాది వేశారు. ఆ తరువాత వీరిద్దరూ ఔటైనా రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు ఆఫ్ఘన్ బౌలర్లు కూడా రాణించారు.

ALSO READ :- గార్బా డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు.. గుజరాత్లో అసలేం జరుగుతుంది