బులవాయో: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా అండర్–19 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయంతో సూపర్–6 కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో ఆయుష్ మాత్రే (53), వైభవ్ సూర్యవంశీ (40), బౌలింగ్‌లో ఆర్‌ఎస్ అంబరీష్ (4/29), హెనిల్ పటేల్ (3/23) చెలరేగడంతో.. శనివారం జరిగిన గ్రూప్–బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) న్యూజిలాండ్‌పై గెలిచింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 రన్స్‌కే ఆలౌటైంది. కల్లమ్ శాంసన్ (37 నాటౌట్) టాప్ స్కోరర్. ఛేజింగ్‌లో మాత్రే, సూర్యవంశీ మెరుపులతో ఇండియా 13.3 ఓవర్లలోనే 130/3 స్కోరు చేసి నెగ్గింది. అంబరీష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
