IND vs SA 1st Test: వర్షం అంతరాయం.. 59 ఓవర్లకే ముగిసిన తొలిరోజు ఆట

IND vs SA 1st Test: వర్షం అంతరాయం.. 59 ఓవర్లకే ముగిసిన తొలిరోజు ఆట

సెంచూరియన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ప్రారంభం కావటానికి ముందు ఓసారి ఎంట్రీ ఇచ్చిన వరుణుడు.. టీ బ్రేక్ అనంతరం మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటి తరువాత వర్షం తగ్గినా తిరిగి కొనసాగించడానికి సమయం లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. 

వర్షం ఆటంకం కలిగించే సమాయానికి భారత జట్టు 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్‌ (70 బ్యాటింగ్, మహ్మద్ సిరాజ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. రేపు అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభం కానుంది.

తొలిరోజు రబాడాదే

ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్ కగిసో రబాడా 5 వికెట్లతో చెలరేగాడు. రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లీ(38), శ్రేయాస్ అయ్యర్(31), రవిచంద్రన్ అశ్విన్(8), శార్దూల్ ఠాకూర్(24) వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లతో రబాడా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లు పూర్తిచేసుకున్నాడు. సఫారీ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.. రబాడా. ఈ జాబితాలో షాన్‌ పొలాక్‌ (823) అగ్రస్థానంలో ఉండగా.. డేల్‌ స్టెయిన్‌ (697), ముఖయా ఎన్తిని (661), అలెన్‌ డొనాల్డ్‌ (602), జాక్వస్‌ కలిస్‌ (572), మోర్నీ మోర్కెల్‌ (535) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.