SA vs IND: కోహ్లీ అరుదైన రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు

SA vs IND: కోహ్లీ అరుదైన రికార్డు.. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు(బాక్సింగ్ డే టెస్ట్)లో టీమిండియా ఓడిపోయినప్పటికీ, భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసిన కోహ్లీ.. 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో ఏడు సంవత్సరాల్లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. 2012లో 2186 పరుగులు చేసిన విరాట్.. 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735, 2019లో 2455, 2023లో 2048 పరుగులు చేశాడు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్‌ గణాంకాలు లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్‌ ఈ ఘనత అందుకోలేదు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర ఆరుసార్లు ఈ ఫీట్‌ సాధించారు.

వీరేంద్రుడు వెనక్కి..

అలాగే ఈ మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ(1350) అవతరించాడు. ఈ క్రమంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(1306)ను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. సచిన్ 25 టెస్ట్‌ల్లో 1741 పరుగులు చేశారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

స్కోర్లు:

  • భారత్ తొలి ఇన్నింగ్స్: 245
  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 408
  • భారత్ రెండో ఇన్నింగ్స్: 131