వార్‌ వన్‌సైడ్‌.. నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం

వార్‌ వన్‌సైడ్‌.. నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. విండీస్ నిర్ధేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని శుభమాన్ గిల్(77), యశస్వి జైస్వాల్(84 నాటౌట్) జోడి పోటీపడి మరీ చేధించారు. వీరిద్దరి ధాటికి కరేబియన్ జట్టు బౌలర్లకు ఆకాశం వైపు చూడటం తప్ప.. మరొక సమాధానమే లేకపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీ చేయగా.. షై హోప్‌(45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో పర్వాలేదనిపించారు. భార‌త బౌల‌ర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం 179 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత ఓపెనర్లు శుభమాన్ గిల్(77; 47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్(84 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) పది ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. వీరిద్దరూ పోటీ పడి మరీ బౌండరీలు బాదారు. గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. జైస్వాల్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ఒక ఓవర్ నీకు.. ఒక ఓవర్ నాకు అన్నట్లు వీరి బ్యాటింగ్ సాగింది.

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. కీలకమైన సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఆదివారం(ఆగష్టు 13) ఇదే వేదికపై జరగనుంది.