ముంబై: ఐఐటీ బాంబే హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు రవీంద్ర, సోనాలీ వాకోడే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రకు చెందిన సహిల్ సెప్టెంబర్ 18న హాస్టల్ గదిలో మృతి చెందాడు. తనను కుల దూషణలతో వేధిస్తున్నారని సహిల్ తమతో చెప్పాడని తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించిన వారు.. ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాతో పాటు ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారేను అరెస్ట్ చేయాలని కోరారు.
వీడియో కాల్ చేసి మాట్లాడిన రాహుల్
సాహిల్ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. సాహిల్ తల్లిదండ్రులతో ఆయన గురువారం వీడియో కాల్‌లో మాట్లాడారు. వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
