
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవవందనం స్వీకరించారు.
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేశ్ వీ పాటిల్‌తోపాటు అడిషనల్ కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, ప్రగతిని వివరించారు. ప్రీడం ఫైటర్స్‌ను సత్కరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రగతి స్టాల్స్, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. - నెట్వర్క్, వెలుగు
ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, వెలుగు: ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70 ఏండ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో కొత్తగా 24 , 818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ చేశామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేశామని చెప్పారు. రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచామని గుర్తు చేశారు. మద్దులపల్లిలో రూ.19.95 కోట్ల ఖర్చు చేసి నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశామని, ఖమ్మంలో రూ.155 కోట్లతో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో 16,153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం కింద 4 కోట్ల 22 లక్షల 98 వేల 507 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల రూ.198 కోట్ల 34 లక్షల 49 వేలను ఆదా చేశారని తెలిపారు. ఇంకా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జిల్లాలోని పర్యాటకం, ఇతర అభివృద్ధిని వివరించారు.
తెలంగాణ ఆయిల్ పామ్ హబ్‌గా భద్రాద్రికొత్తగూడెం జిల్లా : అగ్రిక్చలర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆయిల్ పామ్ హబ్‌గా మారుతోందని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. పోడు భూముల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానంగా రాజీవ్ లింక్ కెనాల్‌ను ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులను రూ. 93 కోట్లతో చేపడ్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీని జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట పనులు సాగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెం నుంచి కిరండోల్ రైల్వే కనెక్టివిటీతో భద్రాచలం సీతారామ చంద్రస్వామి టెంపుల్‌కు భక్తులు వచ్చేలా ఎకో టూరిజం చేపడుతున్నామని వివరించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను గతేడాది సీఎం ప్రారంభించారన్నారు. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి నాగరికత సమాజానికి తెలిపేలా ట్రైబల్ మ్యూజియాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలిపారు.