పంద్రాగస్టున టెర్రర్ అటాక్స్‌కు ప్లాన్?.. నిఘా వర్గాల అలర్ట్

పంద్రాగస్టున టెర్రర్ అటాక్స్‌కు ప్లాన్?.. నిఘా వర్గాల అలర్ట్

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఓ రిపోర్టు ప్రకారం.. మరో రెండ్రోజుల్లో భారత్‌లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా, జైషే మొహ్మద్ టెర్రర్ అటాక్స్‌కు వ్యూహం పన్నుతున్నాయి. 

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు ఎలాగైనా భంగం కలిగించాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఇండియాలో దాడుల కోసం ఉగ్రవాదులను లాంచ్‌ప్యాడ్‌ల ద్వారా పంపేందుకు పాక్ యత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాగా, పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు కశ్మీర్‌లో దాడులకు ప్లాన్ చేసినట్లు తమకు సమాచారం అందిందని, అందుకే అలర్ట్‌గా ఉన్నామని జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు.