భారత్ మా మిత్ర దేశం..హార్మూజ్ జలసంధిని దోస్తులకే తెరుస్తం: ఇరాన్

భారత్ మా మిత్ర దేశం..హార్మూజ్  జలసంధిని దోస్తులకే తెరుస్తం: ఇరాన్
  • హార్మూజ్​  జలసంధిని దోస్తులకే తెరుస్తం: ఇరాన్​
  •     ఇండియా సహా 6 దేశాల లిస్ట్​ 
  •     వాటి నౌకల రాకపోకలకు ఆటంకం లేదన్న ఐఆర్ జీసీ
  •     శత్రు దేశాలు, వారి మిత్ర దేశాల నౌకలకు నో ఎంట్రీ

టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో సరఫరా గొలుసు దెబ్బతిని, అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నౌకలపై ఆంక్షలు విధిస్తూనే, భారత్‌‌‌‌ను తన ‘మిత్ర దేశాల’ జాబితాలో చేర్చడం విశేషం. భారత్‌‌‌‌తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాలకు చెందిన నౌకలను ‘స్నేహపూర్వక నౌకలు’గా పరిగణిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది. భారత్ తన వంటగ్యాస్ (ఎల్ పీజీ) అవసరాలకు సంబంధించి సుమారు 80 నుంచి 90 శాతం దిగుమతుల కోసం ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌‌‌‌లో గ్యాస్ కొరత ఏర్పడి, ధరలు పెరిగే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం భారత ఇంధన భద్రతకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా, భారత్‌‌‌‌కు సరుకు రవాణాలో ఆటంకాలు ఉండవని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం మరింత ముదిరితే ఇతర దేశాల నుంచి వచ్చే ఆంక్షలను భారత్ ఎలా ఎదుర్కోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

సెక్యూరిటీతో పంపిస్తం..

హార్మూజ్ జలసంధి దాటే విషయంలో మిత్ర దేశాల నౌకలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఇస్లామిక్​ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ)  స్పష్టం చేసింది. ముందస్తు సమన్వయం చేసుకున్న నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే భారత్ కు చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’, ‘శివాలిక్’ తదితర నౌకలను సేఫ్ గా జలసంధి దాటించినట్లు గుర్తుచేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌లతో భారత్‌‌‌‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఇరాన్ తన దోస్తుల జాబితాలో చోటివ్వడం ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శత్రు దేశాలకు నో ఎంట్రీ

అమెరికా, ఇజ్రాయెల్ తోపాటు ప్రస్తుత యుద్ధంలో భాగమైన కొన్ని గల్ఫ్ దేశాల నౌకలకు మాత్రం అనుమతి ఇవ్వబోమని  అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. శత్రు దేశాల నౌకలను అనుమతించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇటీవల యూఏఈ నుంచి పాకిస్తాన్‌‌‌‌కు వెళ్తున్న ఒక కంటైనర్ నౌకను అడ్డుకున్నామని, అవసరమైన అనుమతులు లేకపోవడంతో  వెనక్కి పంపించామని చెప్పారు. కాగా, యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి హార్మూజ్ జలసంధి వద్ద రవాణా 95 శాతం తగ్గింది. సాధారణంగా రోజుకు 120 నౌకలు వెళ్తుంటే.. మార్చి 1 నుంచి 25వ తేదీ మధ్య దాదాపు 25 రోజుల్లో కేవలం 155 నౌకలే హార్మూజ్​ను దాటాయి.

‘బాబ్ అల్-మండేబ్’ జలసంధి మూసేస్తం..

తమ భూభాగంపై గానీ, ఖర్గ్ వంటి కీలక దీవులపై గానీ దాడులకు దిగితే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నౌకా రవాణా మార్గమైన ‘బాబ్ అల్-మండేబ్’ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో ఉంచుకున్న ఇరాన్, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గంపై కన్నేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌‌‌‌లను కలిపే బాబ్ అల్-మండేబ్ జలసంధి గుండా ప్రపంచ సముద్ర మార్గ చమురులో సుమారు 12% రవాణా అవుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే, సూయజ్ కాలువ వైపు వెళ్లే సముద్ర రవాణా పూర్తిగా నిలిచిపోతుంది. హార్మూజ్ జలసంధితో పాటు బాబ్ అల్ మండేబ్​ కూడా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తి, ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.