
బ్రిస్బేన్: యస్తికా భాటియా (71 బాల్స్‌లో 9 ఫోర్లతో 66), రాధా యాదవ్ (78 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 60), తనుజా కన్వర్ (57 బాల్స్‌లో 3 ఫోర్లతో 50) బ్యాట్‌తో మెప్పించడంతో ఆస్ట్రేలియా–ఎతో మూడు వన్డేల సిరీస్‌ను ఇండియా–ఎ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో యస్తిక, రాధ, తనుజ ఫిఫ్టీలతో రాణించి రెండు వికెట్ల తేడాతో జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. 266 రన్స్ ఛేజింగ్‌లో ఓ దశలో 193/7తో జట్టు ఓటమి అంచుల్లో నిలిచినా పట్టువిడవకుండా పోరాడి ఆసీస్ పని పట్టారు.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 265/9 స్కోరు చేసింది. అలీసా హీలీ (87 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 91) దంచికొట్టింది. ఓపెనర్ తలియా విల్సన్ (8), కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ (15), అనికా లియోరోడ్ (9), నికోల్ ఫాల్టుమ్ (8) ఫెయిలైనా.. హీలీ అద్భుతంగా ఆడింది. కిమ్ గార్త్ (45 బాల్స్‌లో 4 ఫోర్లతో 41 నాటౌట్), ఎలా హేవార్డ్ (25) కూడా రాణించారు.
ఇండియా బౌలర్లలో మిన్ను మణి మూడు, సైమా ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టగా.. టిటాస్ సాధు, రాధ, ప్రేమ రావత్, తనుజ తలో వికెట్ తీశారు. అనంతరం ఇండియా 49.5 ఓవర్లలో 266/8 స్కోరు చేసి గెలిచింది. ఆసీస్ బౌలర్లలో జార్జియా ప్రెస్ట్‌విడ్జ్, ఎమీ ఎడ్గర్, ఎలా హేవార్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో చివరి మూడో వన్డే ఆదివారం ఇదే గ్రౌండ్‌లో జరుగుతుంది.
థ్రిల్లింగ్ ఛేజింగ్..
టీ20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన ఇండియా అమ్మాయిలు వన్డేల్లో మాత్రం సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నారు. తొలి వన్డేలో బౌలింగ్‌లో ఆకట్టుకున్న రాధా యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా–ఎ ఈ పోరులో బ్యాట్‌తో సత్తా చాటింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్ యస్తిక వరుసగా రెండో ఫిఫ్టీతో విజయానికి బాటలు వేసింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (4), వన్‌డౌన్ బ్యాటర్ ధారా గుజ్జార్ (0) నిరాశ పరిచారు. నాలుగో ఓవర్లో షెఫాలీని గార్త్ ఔట్ చేయగా.. ఆ వెంటనే గుజ్జార్ రనౌటైంది.
ఈ టైమ్‌లో యస్తికా విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకుంది. తేజల్ (19)తో మూడో వికెట్‌కు 47 రన్స్ జోడించిన ఆమె.. రాఘవి బిస్త్ (14)తో 16 రన్స్ జోడించింది. ఎమీ ఎడ్గర్ వెంటవెంటనే తేజల్, రాఘవిని ఔట్ చేయడంతో ఇండియా 83/4తో నిలిచింది. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న యస్తికకు కెప్టెన్ రాధ తోడైంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 68 రన్స్ జోడించారు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత భాటియా.. ప్రిస్ట్‌విడ్జ్ బౌలింగ్‌లో బౌల్డ్ అవగా.. మిన్ను మణి (3) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది.
అయితే, రాధతో కలిసి తనుజ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కానీ, ధాటిగా ఆడుతున్న రాధను 39వ ఓవర్లో హేవార్డ్ పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ రేసులోకి వచ్చింది. అప్పటికి 193/7తో ఇండియా కష్టాల్లో పడింది. చేతిలో మరో మూడు వికెట్లే ఉండటంతో ఒత్తిడి అమాంతం పెరిగింది.
ఈ సమయంలో తనుజకు తోడైన ప్రేమ రావత్ (32 నాటౌట్) ధాటిగా ఆడింది. తనుజ, ప్రేమ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. ఏడో వికెట్‌కు 68 రన్స్ జోడించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తనుజ ఆఖరి ఓవర్ తొలి బాల్‌కే ఔటైనా.. ప్రేమ విజయానికి అవసరమైన మరో ఐదు రన్స్ అందించింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా–ఎ: 50 ఓవర్లలో 265/9 (ఆలిస్సా హీలీ 91, కిమ్ గార్త్ 41 నాటౌట్; మిన్ను మణి 3/46).
ఇండియా–ఎ: 49.5 ఓవర్లలో 266/8 (యస్తికా భాటియా 66, రాధా యాదవ్ 60, తనుజా కన్వర్ 50, ఎమీ ఎడ్గర్ 2/55).