
మెక్‌కే: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా–ఎ విమెన్స్ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలం కావడంతో.. శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా 114 రన్స్ తేడాతో ఆసీస్–ఎ చేతిలో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే హోమ్ టీమ్ 2–0తో సొంతం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 187/4 స్కోరు చేసింది. అలీసా హీలీ (70), తాలియా విల్సన్ (43) తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. అనికా లియరాయిడ్ (35), కోర్ట్నీ వెబ్ (26 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. రాధా యాదవ్ 2, ప్రేమ రావత్ ఒక వికెట్ తీశారు.
తర్వాత ఛేజింగ్‌లో ఇండియా 15.1 ఓవర్లలో 73 రన్స్‌కే కుప్పకూలింది. దినేశ్ వ్రిందా (21) టాప్ స్కోరర్. మిన్ను మణి (20) ఫర్వాలేదనిపించింది. ఆసీస్ బౌలర్లు కిమ్ గార్త్ (4/7), అమీ ఎడ్గర్ (2/17), టెస్ ఫ్లింటాఫ్ (2/23) బౌలింగ్ ధాటికి ఇండియా ఇన్నింగ్స్ కుప్పకూలింది. షెఫాలీ వర్మ (3), రాఘవి బిస్త్ (5), రాధా యాదవ్ (5), సజీవన్ సజన (6), ప్రేమ రావత్ (4), టిటాస్ సాధు (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, ఉమా ఛెత్రి (0), తనుజా కన్వర్ (0) డకౌటయ్యారు. లూసీ హామిల్టన్, జింగెర్ చెరో వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 ఆదివారం ఇదే వేదికపై జరుగుతుంది.