ఇంధన సంక్షోభం..ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్‌..ఇథనాల్‌‌ బంకుల ఏర్పాటుకు కేంద్ర సిద్ధం

ఇంధన సంక్షోభం..ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్‌..ఇథనాల్‌‌ బంకుల ఏర్పాటుకు కేంద్ర సిద్ధం
  • సంక్షోభంతో కొత్త అవకాశాలు
  • పూర్తిగా ఇథనాల్‌‌తో నడిచే బండ్లు తెచ్చే ప్లాన్‌‌ 
  • వేగం పెంచిన కేంద్రం..ఇథనాల్‌‌ బంకుల ఏర్పాటుకు సిద్ధం
  • ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలను ప్రోత్సహించే కొత్త స్కీమ్‌‌
  • ఒక్కో బండిపై రూ.15 లక్షల వరకు బెనిఫిట్స్ 

న్యూఢిల్లీ:ఇరాన్‌‌‌‌, అమెరికా యుద్ధ ప్రభావం ఇండియాపై తీవ్రంగా ఉంది. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో  రూపాయి విలువ పడుతూ,  ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో  ప్రజల జేబు గుల్లవుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా  యుద్ధం వల్ల కొంత మేలు కూడా జరుగుతోందని చెప్పొచ్చు.  ఇంధన సంక్షోభం  వల్ల  ప్రభుత్వం  ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్‌‌ వైపు వేగంగా అడుగులేస్తోంది. ఇంధన భద్రతను కేవలం పర్యావరణ లక్ష్యంగా కాకుండా,   ఆర్థిక అవసరంగా భావిస్తూ  రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

1.'ఇథనాల్ 100' (ఈ100) రోడ్‌‌మ్యాప్..

 రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 ఈ100 (100శాతం ఇథనాల్) బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోలియం మినిస్ట్రీ డేటా ప్రకారం,  వచ్చే నెలలోనే ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌‌పూర్ వంటి నగరాల్లో 150 రిటైల్ ఔట్‌‌లెట్లు ప్రారంభం కానున్నాయి. తర్వాత 6 నుంచి 12 నెలల్లో బెంగళూరు, చెన్నై, కోల్‌‌కతా, హైదరాబాద్‌‌లతో పాటు ఢిల్లీ–-ఎన్‌‌సీఆర్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ సంఖ్యను 500 కి పెంచనున్నారు.

పూర్తిగా ఇథనాల్‌‌తో నడిచే బండ్లు

ప్రభుత్వం క్రూడాయిల్ దిగుమతులను తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్‌‌ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌‌ కలుపుతున్నారు.   మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, హీరో, టీవీఎస్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఏ ఇంధనంతోనైనా నడిచే  'ఫ్లెక్స్ ఫ్యూయల్' వాహనాలను తీసుకొస్తున్నాయి.   పూర్తిగా ఇథనాల్‌‌తో నడిచే బండ్ల  ప్రోటోటైప్‌‌ను కూడా కంపెనీలు రెడీ చేశాయి.  మార్కెట్లో తగినన్ని ఇథనాల్ బంకులు లేకపోవడం వల్ల వాటిని కమర్షియల్‌‌గా లాంచ్ చేయడానికి వెనుకాడుతున్నాయి. మరోవైపు రోడ్లపై వాహనాలు లేకపోవడంతో బంకుల యజమానులు ఇథనాల్ పంపులను పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు.

మైలేజ్ తక్కువ..

 సాధారణ పెట్రోల్‌‌తో పోలిస్తే ఈ100 ఇంధన సామర్థ్యం  తక్కువ. అందుకే కస్టమర్లను ఆకర్షించడానికి ఇథనాల్ ధరను సాధారణ పెట్రోల్ కంటే కనీసం 30శాతం తక్కువగా ఉంచాలని సొసైటీ ఆఫ్ ఇండియన్‌‌ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్‌‌) సూచించింది. కాగా,   ఇథనాల్‌‌ను  ధాన్యం, కూరగాయలు, చెరుకు పిప్పి వంటి వ్యర్ధాల నుంచి తయారు చేయొచ్చు. ఇథనాల్ వాడకం పెరిగితే  సుమారు 8 కోట్ల మంది రైతు కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని అంచనా.  విదేశీ చమురు సంస్థలకు వెళ్లే డబ్బు మన దేశంలోనే ఉంటుంది.

2. కమర్షియల్ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ 

భారతదేశంలో డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వినియోగాన్ని పెంచేందుకు సుమారు రూ.9,600 కోట్ల భారీ ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.  ప్రస్తుతం దేశంలోని 20 లక్షలకు పైగా బస్సులు, ట్రక్కులలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్నవి కేవలం 5 శాతం మాత్రమే. మిగిలిన 95 శాతం బండ్లు ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోనే ఉన్నాయి. 

కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ఈవీల వైపు మళ్లించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ప్రస్తుతం  ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉండడంతో  చిన్న ఆపరేటర్లకు ఊరటనిచ్చేందుకు బండి జీవితకాలంలో రూ.15 లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వాలని  యోచిస్తోంది. ప్రారంభంలో 10 వేల బస్సులకు, ఆపై 50 వేల వాహనాలకు సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.