
హాంగ్జౌ (చైనా): విమెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియా ఫైనల్ చేరుకుంది. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన సూపర్– 4 రౌండ్ చివరి మ్యాచ్‌లో జపాన్‌ను నిలువరించి ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ పోరును ఇండియా 1–-1తో డ్రా చేసుకుంది.
ఏడో నిమిషంలోనే బ్యూటీ డుంగ్ డుంగ్ ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు 1–-0తో ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు జపాన్ ప్లేయర్ కోబయాకావా షిహో గోల్ చేసి 1-–1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య చైనా1–-0తో సౌత్ కొరియాను ఓడించడంతో ఇండియా ఫైనల్ బెర్తు ఖాయమైంది.
చైనా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి మొత్తం 9 పాయింట్లతో సూపర్- –-4 రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా ఒక విజయం, ఓ డ్రా, మరో ఓటమితో నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్ సాధించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో ఇండియా తలపడనుంది. ఈ టోర్నీ విన్నర్ వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.