ఎల్పీజీ సరఫరా కోసం యూఏఈతో ఒప్పందం.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, రక్షణ రంగంలో భాగస్వామ్యంపైనా ఎంఓయూలు

ఎల్పీజీ సరఫరా కోసం యూఏఈతో ఒప్పందం.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, రక్షణ రంగంలో భాగస్వామ్యంపైనా ఎంఓయూలు
  • యూఏఈలో ప్రధాని మోదీ స్వల్పకాలిక పర్యటన 
  • ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
  • యూఏఈపై ఇరాన్ దాడిని ఖండించిన మోదీ 
  • హార్మూజ్ ఓపెన్​గా ఉండాలని, సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని పిలుపు 

న్యూఢిల్లీ/అబుదాబి:భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య ఇంధన భద్రత, రక్షణ భాగస్వామ్యం, వాణిజ్యం అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల స్వల్ప కాలిక పర్యటన కోసం యూఏఈకి చేరుకున్నారు. 

ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలకమైన రంగాలపై యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌‌‌‌‌‌‌తో మోదీ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, మౌలిక సదుపాయాలు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌లో ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులపై కుదిరిన అవగాహన ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.

 గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ద్వారక జిల్లా వాడినార్ వద్ద షిప్ రిపేర్ క్లస్టర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి కూడా ఒక ఒప్పందం కుదిరింది. అబుదాబిలో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ ప్రతి పరిస్థితిలోనూ యూఏఈతో భుజం భుజం కలిపి నడుస్తుందని, ఇది ఇలాగే కొనసాగుతుందని అన్నారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ కోసం భారత్ సాధ్యమైన అన్ని సహకారాలను అందిస్తుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం మధ్య యూఏఈపై ఇరాన్ జరిపిన దాడులను ప్రధాని మోదీ ఖండించారు. హార్మూజ్ జలసంధి స్వేచ్ఛగా, ఓపెన్ గా ఉండటం ముఖ్యమని చెప్పారు.

 ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరారు. భారత్ , యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసినందుకుగాను యూఏఈ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. జనవరిలో యూఏఈ అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినప్పుడు దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని ఇరుదేశాలు అంగీకరించాయని, ఈ స్వల్ప కాలంలోనే గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే ఉత్తమ మార్గమని మోదీ స్పష్టం చేశారు. 

  • యూఏఈ నుంచి యూరప్ పర్యటనకు ప్రధాని  

యూఏఈలో స్వల్ప కాలిక పర్యటన తర్వాత ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరతారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడి నుంచి ఆయన స్వీడన్‌‌‌‌‌‌‌‌లోని గోథెన్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇద్దరు ప్రధాన మంత్రులు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రముఖ పాన్ -యూరోపియన్ వ్యాపార నాయకుల ఫోరమ్ ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి సోమవారం 3వ భారత్ - నార్డిక్ సమిట్, ద్వైపాక్షిక కార్యక్రమాల కోసం నార్వేను సందర్శిస్తారు. పర్యటన చివరి దశలో మోదీ మంగళవారం ఇటలీ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలుస్తారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా భేటీ అయి చర్చలు జరుపుతారు.

  • మోదీ ఫ్లైట్​కు ఎస్కార్ట్​గా ఎఫ్​ 16

పశ్చిమాసియాలో యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ యూఏఈ పర్యటనకు వెళ్లడంతో.. ఆయన విమానానికి రక్షణగా యూఏఈ తన ఫైటర్ జెట్​లను ఎస్కార్ట్​గా పంపింది. యూఏఈ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 బ్లాక్ 60 డెజర్ట్ ఫాల్కన్ యుద్ధ విమానాలు ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిరిండియా వన్ (బోయింగ్ 777300ఈఆర్) విమానానికి ఎస్కార్ట్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అబుదాబి ఎయిర్ పోర్టులో మోదీకి యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించడం ద్వారా కూడా భారత ప్రధాని పట్ల యూఏఈ గౌరవాన్ని చాటుకుంది.