ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమిట్.. ఇవీ కీలక నిర్ణయాలు

ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సమిట్.. ఇవీ కీలక నిర్ణయాలు

న్యూడిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమిట్​ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూఎస్, యూకే, చైనా సహా 86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు.  ఢిల్లీలో జరిగిన ఈ సదస్సు ముగింపులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

‘అందరి సంక్షేమం, అందరి సంతోషం’ అనే సూత్రానికి ప్రపంచ దేశాలు మద్దతు పలికాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మానవ కేంద్రీకృత ఏఐ దార్శనికతను ప్రపంచం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే సామాజిక సామరస్యాన్ని కాపాడటంపై దృష్టి సారించింది. భద్రత, నమ్మకం.. అనే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచింది. ఈ సదస్సు ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో 250 బిలియన్ డాలర్ల పెట్టుబడి హామీలు లభించాయి. డీప్ టెక్ రంగంలో మరో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు సమిట్​ను సందర్శించి నిపుణులతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు పాల్గొనడం వల్ల చర్చలు చాలా ఫలప్రదంగా సాగాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భారత్ ఈ రంగంలో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ.. కీలక నిర్ణయాలు
 ఏఐ వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక వృద్ధి సామాజిక శ్రేయస్సు మధ్య సమతుల్యత పాటించడం ఈ ప్రకటన ప్రధాన లక్ష్యం. ఈ సదస్సు ఏడు కీలక అంశాల ప్రాతిపదికన సాగింది. అందులో ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, సురక్షితమైన ఏఐ వ్యవస్థల నిర్మాణం, శాస్త్ర రంగంలో ఏఐ వినియోగం, మానవ వనరుల అభివృద్ధి వంటివి ముఖ్యమైనవి.  ఏఐ వనరులను అందరికీ సరసమైన ధరకే అందించేందుకు ప్రత్యేక చార్టర్ రూపొందించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఏఐ వినియోగం పెంచేందుకు గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్ అనే వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాస్త్ర పరిశోధనల కోసం అంతర్జాతీయ ఏఐ సంస్థల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. ఏఐ వల్ల ఉపాధి రంగంలో వచ్చే మార్పులను తట్టుకునేందుకు నైపుణ్యాల అభివృద్ధికి ఒక ప్లేబుక్ రూపొందించారు. ఇంధన సామర్థ్యం కలిగిన ఏఐ వ్యవస్థలను ప్రోత్సహించాలని అన్ని దేశాలు ఈ సమిట్​లో నిర్ణయించాయి.