న్యూఢిల్లీ : దేశ ఆటో ఇండస్ట్రీ వెహికల్స్ తయారీలో మరింత వృద్ధి సాధిస్తుందని, వచ్చే 25 ఏళ్లలో గ్లోబల్‌గా టాప్ 2 లో ఉంటుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అంచనావేసింది. అన్ని రకాల వెహికల్ సెగ్మెంట్‌లోనూ దూసుకుపోతామని వివరించింది. ఇంకో పాతికేళ్లలో వెహికల్స్ తయారీలో పూర్తిగా సొంత కాళ్లపై నిలబడాలని ఇండియా ప్లాన్స్ వేస్తోందని సియామ్ 62 వ యాన్యువల్ సెషన్‌లో ఈ సంస్థ ప్రెసిడెంట్, మారుతి బాస్ అయిన కెనిచి ఆయుకవా పేర్కొన్నారు. ‘దీనర్ధం అన్ని రకాల టెక్నాలజీలు..బ్యాటరీ ఎలక్ట్రిక్, ఇథనాల్, ఫ్లెక్స్ ఫ్యూయల్, సీఎన్‌జీ, బయో సీఎన్‌జీ, హైబ్రిడ్ ఎలక్ట్రిక్,హైడ్రోజన్ వంటి సెగ్మెంట్‌లలో దేశ ఆటో ఇండస్ట్రీ వాటా పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ఈ టార్గెట్‌ను చేరుకోవడానికి ఇండస్ట్రీ ఒకే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాపారం చేయడం మరింత సులభంగా మారాలని కోరారు. దీర్ఘకాలిక రెగ్యులేటరీ రోడ్ మ్యాప్‌ను రెడీ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్లను, టెక్నాలజీని, ప్రొడక్ట్‌ల డెవలప్‌మెంట్‌ను మెరుగ్గా ప్లానింగ్ చేసుకోవడానికి వీలుంటుందని అన్నారు. కస్టమర్ల సేఫ్టి, ఇన్ఫోటైన్‌మెంట్ వంటి అంశాలపైన కూడా ఫోకస్ పెంచాలని, ఉద్యోగుల స్కిల్స్ మెరుగుపరిచేలా చూడాలని సియామ్ ప్రెసిడెంట్ వివరించారు.
ఇండస్ట్రీ ఇంకా డౌన్‌లోనే..
ఆటో ఇండస్ట్రీ కరోనా ముందు నుంచే స్లోడౌన్‌లో ఉందని కెనిచి ఆయుకవా అన్నారు. ‘1990 నుంచి 2000 మధ్య దేశ ప్యాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ ఏడాదికి 12.6 శాతం వృద్ధి సాధించింది. తర్వాత దశాబ్ద కాలం అంటే 2000 నుంచి 2010 మధ్య ఆటో ఇండస్ట్రీ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (సీఏజీఆర్) 10.3 శాతానికి పడిపోయింది. 2010 నుంచి 2020 మధ్య ఇది కేవలం 3.6 శాతంగానే రికార్డయ్యింది. గత ఐదేళ్లలో దేశ ఆటో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది’ అని ఆయుకవా వివరించారు. కరోనా సంక్షోభంతో సప్లయ్, డిమాండ్‌కు సంబంధించి సమస్యలు నెలకొన్నాయని, ఇండస్ట్రీ గ్రోత్ మరింతగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీలో కొన్ని సెగ్మెంట్‌లు కరోనా సంక్షోభం నుంచి రికవరీ అవ్వగా, మరికొన్ని సెగ్మెంట్‌లు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయని అన్నారు. ‘ ఎంట్రీ లెవెల్ కార్లు, టూవీలర్ల డిమాండ్ భారీగా తగ్గింది. మరికొన్ని సెగ్మెంట్‌లలో డిమాండ్ కనిపిస్తోంది. కానీ, సెమికండక్టర్ల షార్టేజ్ వలన సప్లయ్ సైడ్ సమస్యలు నెలకొంటున్నాయి. ఈ సమస్యల వలన ప్యాసెంజర్ వెహికల్స్ కావొచ్చు, టూవీలర్లు, త్రీవీలర్లు లేదా కమర్షియల్ వెహికల్స్ అన్ని సెగ్మెంట్‌లు ఇంకా 2018–19 స్థాయి కంటే దిగువనే ఉన్నాయి’ అని ఆయుకవా అన్నారు. దేశ జీడీపీలో ఆటో ఇండస్ట్రీ వాటా 6 శాతం ఉందని, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ అవుట్‌పుట్‌లో 35 శాతం వాటా ఉందని, ఏడాదికి 120 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ చేస్తోందని పేర్కొన్నారు. ఆటో ఇండస్ట్రీ మూడు కోట్ల మందికి ఉపాధి కలిపిస్తోందని, జీఎస్‌టీ కింద రూ.1.5 లక్షల కోట్లు కంట్రిబ్యూట్ చేస్తోందని అన్నారు. డొమెస్టిక్ మార్కెట్‌లోనూ, ఎక్స్‌పోర్ట్స్ పరంగా ఇండస్ట్రీ బాగా విస్తరిస్తోందని తెలిపారు. పీఎల్‌ఐ స్కీమ్, ఫేమ్ 2 స్కీమ్, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, కొత్త కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ అందించడం, వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లు కుదుర్చుకోవడం వంటి ప్రభుత్వ చర్యలను ఆయన కొనియాడారు.
గ్రీన్ ఇన్నొవేషన్లపై ఫోకస్ పెట్టాలి : మోడీ
దేశం సెల్ఫ్ రిలయంట్ ( సొంత కాళ్లపై నిలబడడం) గా మారడానికి, పర్యావరణానికి మేలు చేయడానికి ఆటో ఇండస్ట్రీ గ్రీన్ ఇన్నొవేషన్లపై ఫోకస్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పేర్కొన్నారు. సియామ్ యాన్యువల్ సెషన్‌లో ఆయన తన రాతపూర్వక మెసేజ్‌ను పంపారు. అన్ని సెక్టార్‌లలో స్వతహాగా ఎదగాలని, ఇందుకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మినహాయింపు కాదని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఎకానమీ వృద్ధి చెందడంలో ఆటో మొబైల్ ఇండస్ట్రీ కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తూ అన్ని రకాలుగా పాలుపంచుకుంటోందని వివరించారు. ఈ మెసేజ్‌ను సియామ్ ప్రెసిడెంట్ కెనిచి ఆయుకవా సెషన్‌లో బయటకు చదివి వినిపించారు. ఈ సెషన్‌కి వచ్చిన ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులు, స్టేక్ హోల్డర్లు, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ప్రభుత్వ ప్రతినిధులు అంతా కలిసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ భవిష్యత్ కోసం బ్లూప్రింట్ డెవలప్ చేయాలని కోరారు. వెహికల్స్ తయారీలో గ్లోబల్‌గా నాలుగో అతిపెద్ద ఇండస్ట్రీగా ఎదిగినందుకు మోడీ కంగ్రాట్స్ చెప్పారు.
టూవీలర్ సెక్టార్‌కు ఇంకో ఐదేళ్లు...
2018‑19 లో రికార్డయిన పీక్ లెవెల్‌ను చేరుకోవడానికి దేశ టూవీలర్ సెక్టార్‌కు ఇంకో ఐదేళ్లు పడుతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒగాటా అన్నారు. కరోనా సంక్షోభం నుంచి ఇంకా రూరల్ మార్కెట్ కోలుకోలేదని, మరోవైపు గత రెండేళ్ల నుంచి టూవీలర్ల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అర్బన్ మార్కెట్‌లో మాత్రం కొంత సానుకూలత కనిపిస్తోందని వివరించారు. కాగా, 2018–19 లో డొమెస్టిక్ మార్కెట్‌లో టూవీలర్ హోల్‌సేల్స్ 2,44,42,366 యూనిట్లుగా రికార్డయ్యాయి. 2021–22 లో హోల్‌సేల్స్ 1,34,66,412 యూనిట్లకు పడిపోయాయి.
