పాట్నా: బిహార్‌లో సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఇండియా కూటమి భగ్గుమంది. సీఈసీ జ్ఞానేశ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో విపక్ష నేతలు రోడ్డెక్కారు. శాసనసభ ప్రాంగణ సమీపంలోని షహీద్ స్మారక్ వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు లోక్‌భవన్ మార్చ్ చేపట్టారు. ఎన్నికల సంఘం ఆఫీస్సమీపానికి చేరుకోగానే సాయుధ పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు.
తేజస్వి యాదవ్ వాటిపైకి ఎక్కడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ(ఎంఎల్) నేత అజిత్ కుశ్వాహ అస్వస్థతకు గురికాగా, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్ రామ్ చేతికి బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ బీజేపీకి మేలు చేసేలా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు.
