మరో 9 సీట్లపై చర్చలు!..మహారాష్ట్రలో సీట్ల పంపకంపై ఇండియా కూటమి

మరో 9 సీట్లపై చర్చలు!..మహారాష్ట్రలో సీట్ల పంపకంపై ఇండియా కూటమి

ముంబై: జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ  ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో  సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. సీట్ల పంపకాల విషయంలో  ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), యూపీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో చర్చలు ఓ కొలిక్కి రాగా.. మహారాష్ట్రలో శివసేన(యూబీటీ)ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉండగా 39 సీట్లపై ఒప్పందం కుదిరినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

మరో 9 సీట్ల విషయమై మహావికాస్ అఘాడీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దాంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో  రాహుల్ ఫోన్ లో మాట్లాడారు. ముంబైలో 6 లోక్ సభ స్థానాలు ఉండగా.. 3చోట్ల కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నది. అయితే, ఉద్ధవ్ వర్గం ముంబైలో 4 సీట్లు సహా మొత్తం 18 పార్లమెంటు స్థానాలు కావాలని కోరుతున్నది. మరోవైపు సీట్ల సర్దుబాటుపై శరద్ పవార్​తోనూ రాహుల్ చర్చలు జరిపారు.

మమతను ఒప్పించేందుకు ..

యూపీలోని 80 సీట్లలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. మిగిలిన 63 చోట్ల ఎస్పీ, ఇతర మిత్రపక్షాలు బరిలో దిగుతాయి. ఢిల్లీలో 4 చోట్ల ఆప్, 3 చోట్ల కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. బెంగాల్​లో టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌‌కు 2 స్థానాలకు మించి ఇవ్వలేమని గతంలో తెలిపారు. కాంగ్రెస్‌‌ అంగీకరించకపోవటంతో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ బలంగా ఉన్న 5 స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ కోరనున్నట్లు తెలుస్తున్నది.