రాజ్యాంగవాదాన్ని గెలిపిస్తున్న  ఇండియా కూటమి : సింహాద్రి సోమనబోయిన

రాజ్యాంగవాదాన్ని గెలిపిస్తున్న  ఇండియా కూటమి : సింహాద్రి సోమనబోయిన

ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ బలహీనపడుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్​సభ ఎన్నికలలో మోదీ ప్రభావం బాగా తగ్గింది.  బీజేపీ హిందూత్వ సిద్ధాంతం ఎన్నికల చర్చనీయ అంశంగా లేదు.  బీజేపీ కార్యకర్తలలో ఉదాసీనత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.   ఇంతటి మార్పుకు ప్రధాన కారణం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు బలంగా రాజ్యాంగవాదాన్ని ముందుకు తీసుకురావడమే.  ఇది దశాబ్దాలుగా ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా చూడవచ్చు.  

బీజేపీ నినాదం 'అబ్ కి బార్,  చార్ సౌ పార్'  నినాదంతో రాజ్యాంగం ముప్పులో పడుతున్నదని  ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయి. బీజేపీ నినాదం రాజ్యాంగం మార్చడానికి అవసరమైన 2/3 మెజారిటీని సూచిస్తున్నది. అందుకే ఎన్నికలలో రాజ్యాంగ పరిరక్షణ ఎజెండా బలపడింది.  గత సంవత్సర కాలం నుంచి బిహార్​లో  కులగణన జరిపి రిజర్వేషన్లు 75 శాతానికి పెంచడమైంది. అదేవిధంగా గత సంవత్సర కాలంగా అఖిలేశ్​యాదవ్ యూపీలో  కుల జనగణనపై ప్రచారానికి పూనుకోవడం జరిగింది. 

కులగణన జాతీయ ఎజెండా

రాహుల్ గాంధీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కోలార్ నుంచి ఓబీసీ సమస్యను మొదటిసారిగా బలంగా మాట్లాడారు.  భారత్ జోడో యాత్ర ద్వారా ప్రధాన ప్రతిపక్ష నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. భారత్ న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జరిగింది.  ఈ యాత్ర కులగణన, సామాజిక న్యాయం జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఎజెండాగా దేశం ముందు నిలబెట్టింది.  దీంట్లో భాగంగా ఎస్సీ,  ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడినట్లు చర్చనీయాంశంగా మారింది.

అదేవిధంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు భారత రాజ్య వ్యవస్థలో స్థానం కరువైనట్లు తేలింది. దాంతో ఇండియా అలయన్స్ భాగస్వామ్య పార్టీలు  రాజ్యాంగం ముప్పుతో పాటు రిజర్వేషన్ల ముప్పు బలంగా ప్రజలు ముందుకు తీసుకొచ్చాయి.  ఒకవైపు నిరుద్యోగం దేశంలో తాండవిస్తుంటే  రెండోవైపు అందు బాటులో ఉన్న రిజర్వేషన్లను అమలుచేయకపోవడంతో భారతీయ సమాజం తీవ్ర ఇబ్బందులకు గురైంది.  

ప్రభుత్వ రంగంలో ఉన్న లక్షలాది ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉంచుతూ ఉద్యోగ భర్తీలను అడ్డుకుంటోంది. రక్షణ రంగంలో అగ్నివీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగాలను నాలుగు సంవత్సరాలకి కుదించడంతో ఉద్యోగ భద్రత కొరవడింది. అందుకే ఈరోజు రిజర్వేషన్ల తొలగింపు, భారత రాజ్యాంగ మార్పు వ్యతిరేకత కీలకమైన జాతీయ ఎజెండాగా ముందుకువచ్చింది. ఇది గొప్ప పరిణామంగా మనం గుర్తించాలి. ఈ ఎలక్షన్లలో ఎజెండాపరంగా భారతజాతి, ఇండియా అలయన్స్  గెలుపొందినట్లుగా చూడవచ్చు. 

దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఉద్యమం

దేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న రిజర్వేషన్ల ఉద్యమం, కులగణన, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలుఊపందుకోవడం ఒక విప్లవాత్మకమైన పరిణామంగా చూడాలి. ఈ మేరకు బీజేపీ మత విద్వేష ఎజెండా ఓడినట్లే!   ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా  రాజ్యాంగ ఉద్యమం కీలకంగా మారడంతో  భారతజాతి భవిష్యత్తును ప్రజలు కాపాడుకున్నట్లుగా గుర్తించాలి.  బీజేపీ 10 సంవత్సరాల్లో  మతతత్వ ఉద్యమంతో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.  ముఖ్యంగా రాజ్యాంగ వర్గాలైన ఎస్సీ, ఎస్టీ,  ఓబీసీ,  మైనారిటీ,  పేదలను గుర్తించాల్సిన అవసరం ఉంది.  

బుద్ధుడి నుంచి బసవన్న, కబీర్,  రవి దాస్,  ఫూలే,  పెరియార్,  నారాయణ గురు, అంబేద్కర్ వరకు సామాజిక విప్లవకారులు నినదించిన సమానత్వ ఉద్యమ ప్రభావం భారత రాజ్యాంగ రచనలో కనపడుతోంది.  అమెరికా, ఫ్రాన్స్,  రష్యా, చైనాలో వచ్చిన విప్లవాల ప్రభావం  కూడా రాజ్యాంగ నిర్మాతలపై ఉన్నట్లు కనిపిస్తోంది.  అందుకే నెహ్రూ రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్ 13 ఆబ్జెక్టివ్ రిజర్వేషన్  ప్రవేశపెట్టి సమాజవాదంపై చర్చించారు.

రాజ్యాంగానికి మూలసూత్రం సమానత్వం

భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో  సూచించిన సమానత్వం  మొత్తం  రాజ్యాంగానికి మూల సూత్రంగా ఉన్నది.  దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలపై  పోరాటం చేయడానికి ' సమానత్వం' ఎంతో  ఉపకరిస్తోంది.  దాంట్లో భాగంగా  ఆర్టికల్ 15, 16లను  చేర్చడంతో విద్య, ఉద్యోగ రంగాలలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సమానత్వం అందించడం జరుగుతోంది.  ఈ ఆర్టికల్స్ సామాజిక అసమానతలను  తొలగించే  పోరాటానికి  దశ,  దిశను నిర్దేశిస్తున్నది.  వీటి ద్వారా  రాజ్యాంగ కులాలు, వర్గాలు  రాజ్య వ్యవస్థలో  చోటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.  

ఇంత గొప్ప లక్ష్యంతో  ఉన్న రిజర్వేషన్లను తొలగించాలనుకోవడం బీజేపీ మతతత్వ శక్తుల అజ్ఞానానికి,  జాతి వ్యతిరేకతకు నిదర్శనంగా భావించాలి.  రాజ్యాంగం డైరెక్టివ్  ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా సంపద కొన్ని వర్గాల చేతిలో ఉంచడం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్​కు విఘాతాన్ని కలిగిస్తుందని చెప్తోంది.  అసమానత్వానికి దారితీస్తుంది కాబట్టి ఆర్టికల్ 39 కాన్సన్ట్రేషన్  ఆఫ్  వెల్త్  జరగకూడదని నిర్దేశిస్తుంది. కానీ,  ప్రైవేటైజేషన్ పేరుతో  మొత్తం ప్రభుత్వ రంగాలను,  ప్రజల వనరులను, సేవా రంగాలను కొంతమంది కార్పొరేట్లకు అప్పజెప్పడం రాజ్యాంగ వ్యతిరేక చర్య.  మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్పొరేటీకరణ రాజ్యాంగ వ్యతిరేకతకు ఒక బహిరంగ నిదర్శనం.

రాజ్యాంగ స్ఫూర్తి నిర్వీర్యం

'సంక్షేమం' ఒక కీలక అంశంగా రాజ్యాంగం సూచిస్తోంది.  జీవనోపాధి  పొందే హక్కు,  జీవించే హక్కు,  విద్య ద్వారా సామాజిక వెనుకబాటుని తొలగించడం ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం సూచించింది. అయినప్పటికీ  విద్యకు  బడ్జెట్​ తగ్గించి,  ప్రభుత్వ రంగం నుంచి తొలగిస్తూ  ప్రైవేటు రంగాన్ని  ప్రమోట్ చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అవుతున్నది.  విద్యా వ్యాపారీకరణతో  పేదలు,  మధ్యతరగతి వర్గాలు,  నిరుద్యోగులు, ఉద్యోగుల  పిల్లలు  విద్యకు దూరమవుతున్నారు.  విద్యా వ్యాపారం సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనానికి  కారణం అవుతోంది.

భారతదేశాన్ని వెనుకకు నడిపిస్తున్నది. రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తుంది.  భారత జాతి అభివృద్ధి,  అవకాశాలు,  ఆత్మగౌరవంలతో  కూడిన ఆకాంక్షలను అణచివేస్తోంది. ఇది బీజేపీ  ప్రభుత్వం చేస్తున్న  ద్రోహం.    ఫెడరలిజంలో  భాగంగా  రాష్ట్రాలకు ఉన్న  హక్కులను హరించడం కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్య  అవుతోంది.   రాజ్యాంగ లక్ష్యాలైన   ప్రజాసామ్యాన్ని,  సంక్షేమాన్ని, అభివృద్ధిని  విస్మరించడం  ప్రభుత్వాల అక్రమ చర్యలుగా  ప్రజలు గుర్తించాలి.  సామాజిక అసమానతలను  కొనసాగించడం  రాజ్యాంగాన్ని అతిక్రమించడమే.  

ధనికులకు,  పేదలకు మధ్య అంతరాలు పెంచడం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడమే. పేదలకు,  సామాజికంగా వెనుకబడిన వర్గాలు,  మహిళలు,  మైనారిటీల భవిష్యత్తుకు  రాజ్యాంగం అతి కీలకమైన గ్రంథం.  ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో  రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం దేశ చైతన్యానికి నాంది పలికింది.  ప్రజల భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది.  రిజర్వేషన్ల ఉద్యమం, కుల గణన ఉద్యమం, రాజ్యాంగ ఉద్యమం.. ఈ మూడు ఉద్యమాలు భారత భవిష్యత్తును నిర్ణయించేవిగా మారనున్నాయి.  రాజ్యాంగ ఉద్యమం భారతజాతి అస్తిత్వాన్ని కాపాడుతుంది.  

రాజ్యాంగ పీఠికలో సోషలిజం

రాజ్యాంగ పీఠికలో  ప్రజాస్వామ్యం,  లౌకికవాదంతో పాటు  సమాజవాదంను చేర్చారు.  ముఖ్యంగా  న్యాయం,  సమానత్వం, స్వేచ్ఛ,  సోదర భావం,  ఐక్యతలను రాజ్యాంగ పీఠిక తెలియజేస్తోంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ పీఠికను  రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగంగా ప్రకటించింది. అంటే పార్లమెంటుకు వీటిని బలోపేతం చేసే హక్కు మాత్రమే ఉన్నది.  కానీ, రాజ్యాంగంలోని  బేసిక్ స్ట్రక్చర్​ను  మార్చే హక్కు  పార్లమెంటుకు  లేదని సుప్రీంకోర్టు 1974లో తీర్పునిచ్చింది.  ఇంత బలమైన రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం బీజేపీ, ఆర్ఎస్ఎస్​ల​ అన్యాయమైన దృక్పథంగా భావించాలి.  

- ప్రొఫెసర్  సింహాద్రి సోమనబోయిన,
రాష్ట్ర అధ్యక్షుడు, 
సమాజ్​వాది పార్టీ