ఢిల్లీ: భారత్, -బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల 57వ ద్వైవార్షిక డీజీ స్థాయి సమన్వయ సదస్సు ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో సరిహద్దు మరణాలు, అక్రమ, బలవంతపు చొరబాట్లను అరికట్టడంపై ఇరుదేశాలు సుదీర్ఘంగా చర్చించాయి. భారత పక్షానికి బీఎస్‌ఎఫ్ డీజీ ప్రవీణ్ కుమార్, బంగ్లాదేశ్ పక్షానికి బీజీబీ డీజీ మేజర్ జనరల్ మహ్మద్ అష్రపుజ్జమాన్ సిద్ధిఖీ నాయకత్వం వహించారు.
మాదకద్రవ్యాలు, ఆయుధాలు, నకిలీ కరెన్సీ, బంగారం స్మగ్లింగ్‌తో పాటు మానవ అక్రమ రవాణా లాంటి సరిహద్దు నేరాలను అడ్డుకునేందుకు ఉమ్మడి గస్తీని, నిఘాను బలోపేతం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాల కోసం ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకోవాలని అంగీకరించాయి.
ఢాకాలో బీఎన్‌పీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి సమావేశం కావడం వల్ల దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దళాల మధ్య పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ సానుకూల వాతావరణంలో ఈ సమావేశం ముగిసింది. తదుపరి సమావేశాలు నవంబర్‌లో ఢాకాలో జరగనున్నాయి.
