V6 News

వన్డే వార్ : నేడు కివీస్‌తో ఇండియా వామప్‌ మ్యాచ్

వన్డే వార్ : నేడు కివీస్‌తో ఇండియా వామప్‌ మ్యాచ్

లండన్‌: మూడో ప్రపంచకప్‌పై దృష్టి పెట్టిన టీమిండియా సన్నాహక పోరుకు సిద్ధమైంది. గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో శనివారం జరిగే తొలి వామప్‌లో  తలపడనుంది. వచ్చేనెల ఐదున దక్షిణాఫ్రికాతో జరిగే  తొలి మ్యాచ్‌కు ముందు జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావాలని కోహ్లీసేన ఆశిస్తోంది. ముఖ్యంగా నాలుగో నంబర్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై స్పష్టత తెచ్చుకోవడంతో పాటు ఇంగ్లిష్‌ గడ్డపై ఫ్లాట్‌ పిచ్‌లపై ఎలా బౌలింగ్‌  చేయాలో ఓ అంచనాకు వచ్చేందుకు వామప్​ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. గత కొంతకాలంగా ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ అంతా టాపార్డర్‌పైనే కేంద్రీకృతమైంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చాలా మ్యాచ్‌ల్లో  పరుగుల వరద పారించారు. అయితే  వీరంతా విఫలమైనప్పుడు కీలకమైన నాలుగో నంబర్‌లో  సత్తా చాటే ఆటగాడు ఎవరనేదానిపై స్పష్టత కొరవడింది. రిజర్వ్‌ ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌లను ఈ స్థానం కోసం పరీక్షించనున్నారు.

అయితే ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఈ స్థానంలో రాహుల్‌ వచ్చే అవకాశముంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కాబట్టి జట్టులోని బౌలర్లంతా తలా కొన్నేసి ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశముంది. ఇంగ్లిష్‌గడ్డపై తన బౌలర్లను పరీక్షించేందుకు కోహ్లీకి ఈ మ్యాచ్‌ ఉపకరించనుంది. మరోవైపు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌ కూడా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 19న బంగ్లాదేశ్‌తో చివరి వన్డే ఆడిన కివీస్‌ చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ జట్టుగా కాంపిటేటివ్‌ మ్యాచ్‌లోకి అడుగుపెట్టనుంది. కాగా, మరో మ్యాచ్​లో ఆతిథ్య ఇంగ్లండ్​తో ఆస్ట్రేలియా పోటీ పడనుంది.