భారతదేశం, రష్యా మధ్య సంబంధాలు అత్యంత పురాతన కాలానికి సంబంధించినవి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు మూలాలు 18వ శతాబ్దం నాటికే ఏర్పడ్డాయి. 18వ శతాబ్దంలో రష్యా సామ్రాజ్యం మధ్య ఆసియా వైపు విస్తరించడం ప్రారంభించినప్పుడు భారతదేశం రష్యా దృష్టిలో ఒక సాంస్కృతిక వాణిజ్య వ్యూహాత్మక కేంద్రంగా కనిపించింది. ఈకాలంలోనే అనేకమంది రష్యన్ ప్రయాణికులు, క్రిస్టియన్ మత బోధకులు భారతదేశాన్ని సందర్శించారు.
రష్యన్ ప్రయాణ రచనలలో భారతదేశంలోని పంజాబ్, కాశ్మీర్, బెంగాల్ ప్రాంతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. 1905, 1917 రష్యా విప్లవం ప్రభావం భారత స్వాతంత్ర్య ఉద్యమంపై బలంగా పడింది. భగత్ సింగ్, లాలా హరికిషన్ లాల్ వంటి గొప్ప విప్లవకారులు లెనిన్, మార్క్స్ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేశారు.
భారతదేశ యువకులకు సోవియట్ సమానత్వ సిద్ధాంతం ఎంతగానో ప్రేరణగా నిలిచింది. 1930వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యాను సందర్శించడం భారత్– రష్యా సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచింది. భారతదేశాన్ని 1947 ఏప్రిల్‌లో సోవియట్ యూనియన్ ఒక శక్తిమంతమైన దేశంగా గుర్తించింది.
భారతదేశం నాన్ అలైన్మూమెంట్లో ఉండటం వల్ల రష్యా, భారతదేశం పాశ్చాత్య దేశాలకు దగ్గరగా ఉన్నట్లుగా భావించి, భారత్‌తో బలమైన సంబంధాలను కొనసాగించలేదు. అయినా తర్వాత కాలంలో నెహ్రూ, - స్టాలిన్ల చొరవతో విద్య, పారిశ్రామిక, సాంస్కృతిక సంబంధాలు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయి.
భారతదేశ రక్షణ వ్యవస్థలో సోవియట్ టెక్నాలజీ
1955లో క్రుష్చేవ్, బుల్గానిన్ భారతదేశాన్ని సందర్శించడం చరిత్రాత్మక మలుపు. వారు కాశ్మీర్ విషయంలో భారతదేశానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడంతో భారత్– సోవియట్ సంబంధాల్లో బలమైన పునాదులు ఏర్పడ్డాయి. 1962లో సోవియట్ యూనియన్ ఎంఐజి 21 విమానాలను భారతదేశానికి ఇచ్చిన మొట్టమొదటి దేశం. అంతేకాకుండా 1960 – 80 మధ్య సంవత్సరాలలో భారతదేశ రక్షణ వ్యవస్థలో సోవియట్ టెక్నాలజీ దాదాపు 75% గా ఉంది.
అంతేకాకుండా రష్యా ఆర్థిక సహకారంతో భిలాయి స్టీల్ ప్లాంట్, బొకారో స్టీల్ ప్లాంట్, మిషన్ బిల్డింగ్ ప్లాంట్లు విద్యుత్ ఏర్పరచడం భారతదేశం ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడానికి ఎంతగానో దోహదపడింది. 1971లో భారతదేశం, సోవియట్ యూనియన్ల మధ్య ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ .. భారత్, పాకిస్తాన్ యుద్ధ సమయంలో కీలకంగా మారింది. ఇది భారతదేశానికి అంతర్జాతీయంగా ఎంతో బలాన్ని చేకూర్చింది. 1991లో సోవియట్ యూనియన్ లో విభేదాలు రావడంతో భారతదేశానికి రూపీ, రూబుల్ మారకం సమస్య వచ్చింది.
రష్యన్ రక్షణ పరిశ్రమ విచ్ఛిన్నమవడంతో రక్షణ సామగ్రి సరఫరాలో ఆలస్యం అయ్యింది. 1993లో కొత్త ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ ద్వారా సంబంధాలను పునరుద్ధరించారు. క్రమక్రమంగా 2000 సంవత్సరం నాటికి భారత – రష్యా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి. రక్షణ–సాంకేతిక సహకారంతో సుఖోయ్, బ్రహ్మోస్ క్షిపణి సంయుక్తాభివృద్ధి, అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర లీజింగ్, అణుశక్తి రంగంలాంటి కీలక మైన అంశంలో ఎంతో పురోగతి సాధించింది. అంతేకాకుండా రష్యా సహకారంతో నిర్మించిన కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం భారత అణుశక్తి చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది.
బిలియన్ డాలర్ల భారత్-రష్యా వాణిజ్యం
2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 68.72 బిలియన్ డాలర్లు. భారత్ ఎగుమతులు 4.88 బిలియన్ అమెరికా డాలర్లు కాగా, రష్యా నుంచి దిగుమతులు 63.84 బిలియన్ అమెరికన్ డాలర్లు. 2025 ఆర్థిక సంవత్సరంలో రష్యాకు భారతదేశం ఎగుమతి 4.88 బిలియన్ డాలర్లు కాగా, భారతదేశం 3,700 వస్తువులను రష్యాకు ఎగుమతి చేసింది.
2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి రష్యాకు ఎగుమతి చేసిన ప్రధాన వస్తువులలో ఇంజినీరింగ్ వస్తువులు (US$ 1.26 బిలియన్లు). ఎలక్ట్రానిక్ వస్తువులు (US$ 862.48 మిలియన్లు), ఔషధ సూత్రీకరణలు (US$ 577.22 మిలియన్లు), సేంద్రీయ, అకర్బన రసాయనాలు(US$ 545 మిలియన్లు), ఇతరమైనవి (US$ 248.40 మిలియన్లు) మొదలైనవి ఉన్నాయి. రష్యా నుంచి భారతదేశానికి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 63.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
2025వ సంవత్సరంలో భారతదేశం రష్యా నుంచి 700 వస్తువులను దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి భారతదేశం దిగుమతులలో పెట్రోలియం క్రూడ్ (56.8 బిలియన్ డాలర్లు), ఎరువుల తయారీదారులు (1.84 బిలియన్ డాలర్లు), జంతు లేదా కూరగాయల కొవ్వులు, నూనెలు (2.39 బిలియన్ డాలర్లు), ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్ళు (433.93 మిలియన్ డాలర్లు) మొదలైనవి ఉన్నాయి.
ఇటీవల ఇరుదేశాలు తమ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. వారు తమ సంబంధాలకు ఒక సాధారణ వ్యూహాత్మక హేతుబద్ధతను పంచుకుంటూనే ఉన్నారు. ద్వైపాక్షిక సమన్వయానికి తోడు, బ్రిక్స్, ఆర్ఐసి, జి20, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఎస్ సిఒలు సహా వివిధ బహుళ పక్షీయ సంస్థలలో భారతదేశం, రష్యాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థలలో పరస్పర ప్రాముఖ్యం కలిగిన అంశాలపై సహకారానికి మార్గాలు ఉన్నాయి.
పుతిన్ పర్యటన 2025
ఢిల్లీలో జరిగిన 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి రక్షణ, వాణిజ్యం, ఆర్థికవ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, విద్య, సంస్కృతి, మీడియాకు సంబంధించిన రంగాలలో పదహారు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ సమావేశంలో భారత్,- రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తమైంది. ఈ విశ్వాసమే రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తును సుసంపన్నం చేస్తుందని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, రష్యా భుజం భుజం కలిపి నిలబడతాయని పేర్కొన్నారు.
ఉగ్రవాదం అనేది ‘మానవాళి విలువలపై ప్రత్యక్ష దాడి’ అనేటటువంటి భారతదేశం అచంచలమైన నమ్మకాన్ని పుతిన్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఐక్యత అనేది గొప్ప బలం అని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు.
ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కృషి
యూరోపియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే దిశలో ఉభయ పక్షాలు కృషి చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను భారత్ త్వరలో ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరడానికి ఫ్రమ్ వర్క్ ఒప్పందాన్ని ఆమోదించాలని రష్యా నిర్ణయించిందని మోదీ తెలపడం ఆహ్వానించదగిన పరిణామం. ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రక మైలురాళ్లను చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షు డు పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయాలలో అత్యంత విశిష్టతను కలిగి ఉంది.
గత పదేళ్లలో ప్రపంచం అనేక ఒడుదొడుకులను చూసిందని, వీటన్నింటి మధ్య భారత్, -రష్యా సంబంధాలు కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పుతిన్ పర్యటనతో భారత్, రష్యా దౌత్య సంబంధాలు మరింత బలాన్ని పెంచుకోవడమే కాకుండా, ప్రపంచ దేశాలకు సరికొత్త సందేశాన్ని అందించింది. రాబోయే రోజుల్లో భారత్, రష్యా కలిసి మరింత పటిష్టంగా తమ ఆర్థిక వ్యవస్థల నిర్మాణం చేసుకుంటూ ప్రపంచ మానవాళి అభివృద్ధి కోసం కూడా పాటుపడుతుందని సందేశాన్ని ఇచ్చినట్లుగా అయింది.
- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,హెచ్‌సీయూ-
