అమెరికా ట్రేడ్‌‌‌‌ డీల్ ఫ్యాక్ట్‌‌‌‌ షీట్‌‌‌‌లో కీలక సవరణలు.. పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు వాక్యం తొలగింపు

అమెరికా ట్రేడ్‌‌‌‌ డీల్ ఫ్యాక్ట్‌‌‌‌ షీట్‌‌‌‌లో కీలక సవరణలు.. పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు వాక్యం తొలగింపు
  • గంటల వ్యవధిలోనే మార్పులు
  • ‘పప్పుధాన్యాలపై టారిఫ్ తగ్గింపు’ వాక్యం తొలగింపు 
  • ‘డిజిటల్ సర్వీసెస్ టాక్స్‌‌‌‌ తొలగింపు’ ప్రకటనకు సవరణ
  • అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలు విషయంలోనూ క్లారిటీ
  • ఒప్పందంలో లేని అంశాలను  చేర్చడంపై భారత్ అభ్యంతరం

న్యూయార్క్‌‌‌‌:  ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో  లేని అంశాలను కూడా జాబితాలో చేర్చడంపై భారత్ అభ్యంతరం వ్యక్తంచేయగా.. అమెరికా స్పందించింది. భారత్‌‌‌‌–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై యూఎస్‌‌‌‌ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌‌‌‌లో గంటల వ్యవధిలోనే కీలక మార్పులు చేసింది. తన ప్రకటనలోని కొన్ని సున్నితమైన అంశాలను సవరించింది. మరి కొన్నింటిని పూర్తిగా తొలగించింది. తొలుత అమెరికా విడుదల చేసిన జాబితాలో భారత్  దిగుమతి సుంకాలను తగ్గించాల్సిన వస్తువుల జాబితాలో ‘పప్పు దినుసులను’ చేర్చారు. 

అయితే,  పప్పు ధాన్యాలు దేశంలో సున్నితమైన అంశం కావడంతో ఇక్కడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత్  దీనిపై అభ్యంతరం తెలిపింది. ఫలితంగా, తాజా జాబితా నుంచి ‘పప్పుధాన్యాల’ను  అమెరికా తొలగించింది.  అలాగే.. భారత్ తన ‘డిజిటల్ సర్వీసెస్ టాక్స్‌‌‌‌ను తొలగిస్తుంది’ అని అమెరికా తొలుత ప్రకటించింది. కానీ భారత్‌‌‌‌ ఇప్పటికే ఆర్థిక బిల్లు –2025 ద్వారా 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే డిజిటల్ ప్రకటన సేవలపై 6% ఈక్వలైజేషన్ లెవీని తొలగించింది. 

ఈ విషయాన్ని గమనించిన అమెరికా.. ఆ వాక్యాన్ని తొలగించి, కేవలం ‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై చర్చలు జరిపేందుకు భారత్ అంగీకరించింది’ అని మార్చింది. ఈ ఫ్యాక్ట్ షీట్‌‌‌‌లో కేవలం వస్తువుల జాబితాలోనే కాకుండా పదజాలంలో కూడా  కీలక మార్పులు చేసింది. గత జాబితాలో  భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ‘కట్టుబడి ఉంది’ అని అమెరికా పేర్కొన్నది. దీనిపైనా భారత్‌‌‌‌ అబ్జెక్షన్‌‌‌‌ తెలపడంతో దాన్ని ‘‘కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉంది” అని మార్చింది. ఈ కొనుగోలు జాబితా నుంచి ‘అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌’ అనే పదాన్ని కూడా యూఎస్‌‌‌‌  తొలగించింది. భారత్‌‌‌‌పై ఎలాంటి చట్టపరమైన లేదా ఒత్తిడి లేకుండా ఈ సవరణలు చేసింది. 

మ్యాప్‌‌‌‌ వివాదం.. యూఎస్‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ వెనకడుగు.

అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మ్యాప్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ మ్యాప్‌‌‌‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), అక్సాయ్ చిన్‌‌‌‌లను అమెరికా తొలిసారి భారత్‌‌‌‌లో భాగంగా చూపించింది. సాధారణంగా ఈ ప్రాంతాలను ‘వివాదాస్పద ప్రాంతాలు’గా గుర్తిస్తుంది. కానీ ఈసారి  ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాలను భారత భూభాగంలో భాగం చేయడంతో పాక్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. 

ఈ మ్యాప్ తీవ్ర చర్చకు దారితీయడంతో ఆ పోస్టును తన ‘ఎక్స్‌‌‌‌’ ఖాతానుంచి తొలగించింది. పూర్తి మ్యాప్‌‌‌‌ను చూపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ స్పందించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌‌‌‌లో అంతర్భాగమేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది.