అఫ్గాన్‌ నుంచి బయటపడాలనుకునే వాళ్లకు భారత్‌ ఎమర్జెన్సీ ఈ వీసాలు

అఫ్గాన్‌ నుంచి బయటపడాలనుకునే వాళ్లకు భారత్‌ ఎమర్జెన్సీ ఈ వీసాలు

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆ దేశం నుంచి భారత్ రావాలనుకునే అఫ్గాన్‌ ప్రజలకు ఎమర్జెన్సీ ఈ వీసా మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ కు రావాలనుకునే హిందువులు, సిక్కులకు సాయం అందిస్తామని నిన్ననే భారత్ ప్రకటించింది. మిగతా మతాల వారికి కూడా సాయం చేస్తామని, అయితే హిందువులు, సిక్కులకు ప్రయారిటీ ఇస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రివ్యూ చేసి వీసాల విషయంలో అత్యవసర నిర్ణయం తీసుకుంది. ఇండియాలో ఎంట్రీ కోసం ఫాస్ట్ ట్రాక్ వీసా అప్లికేషన్స్ ప్రకటించింది. ఈ-ఎమర్జెన్సీ X-మిస్క్ వీసా పేరుతో కొత్త వీసాను తీసుకొచ్చింది.

అఫ్గాన్‌ను పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వచ్చేయడంతో ఆ దేశం నుంచి ఎలాగైనా బయటపడాలని వందల మంది అఫ్గాన్ ప్రజలు నిన్న కాబూల్ ఎయిర్‌‌పోర్టులోకి దూసుకొచ్చారు. అమెరికాకు వెళ్తున్న విమానాల్లో ఎక్కేందుకు ప్రయత్నించి, ఆ ఫ్లైట్ వెంట పరుగులు తీసిన వీడియోలు బయటకు వచ్చాయి. విమానం రెక్కలు పట్టుకుని అయినా సరే దేశం దాటాలని ట్రై చేసి గాలిలో నుంచి కిందపడి ముగ్గురు అఫ్గాన్లు ప్రాణాలు కోల్పోయిన సీన్లు అక్కడి దీనావస్థకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ నుంచి బయటకు రావాలనుకునే ఆ దేశ పౌరులకు అత్యవసరంగా ఈ వీసాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.