30 దేశాలతో హార్ముజ్ జలసంధి సదస్సు.. భారత్ కీలక చర్చలు

30 దేశాలతో హార్ముజ్ జలసంధి సదస్సు.. భారత్ కీలక చర్చలు

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య మూతపడిన అత్యంత కీలకమైన  హోర్ముజ్ జలసంధి ని తిరిగి తెరిపించేందుకు అమెరికా ప్రమేయం లేకుండా ప్రపంచ దేశాలు  ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా గురువారం యూకే  ఆధ్వర్యంలో 30 దేశాలతో జరిగిన వర్చువల్ సదస్సులో భారత్ పాల్గొంది. దౌత్య, రాజకీయ మార్గాల ద్వారా ఈ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.

యూకే పంపిన ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ నుంచి ఈ సదస్సులో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఎల్‌పిజి, ఎల్‌ఎన్‌జి వంటి ఉత్పత్తులతో వెళ్తున్న భారతీయ నౌకల భద్రత కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని జైస్వాల్ తెలిపారు. దౌత్య చర్చల ఫలితంగా, గత కొద్ది రోజుల్లో ఆరు భారతీయ వాణిజ్య నౌకలు ఈ జలసంధిని సురక్షితంగా దాటగలిగాయని ఆయన స్పష్టం చేశారు.

సదస్సుకు దూరంగా అమెరికా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బ్రిటన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు అగ్రరాజ్యం అమెరికా దూరంగా ఉంది. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. "ఇతర దేశాలు కొంత ఆలస్యమైనా ధైర్యాన్ని కూడగట్టుకుని, ఈ మార్గాన్ని తిరిగి తెరిచేందుకు బాధ్యత తీసుకోవాలంటూ సెటైర్లు వేశారు. 

ఫిబ్రవరి చివర్ లో  అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా.. ఇరాన్ కీలకమై హార్ముజ్  జలసంధిని దిగ్బంధించింది. సముద్ర మార్గం ద్వారా జరిగే ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం కేవలం ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇది మూతపడటంతో ఇంధన ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

భారత్‌కు ఎందుకంత కీలకం? 
పశ్చిమాసియా సంక్షోభం ,హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఇంధన భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది.  భారత్ తన ముడి చమురు అవసరాల్లో ఏకంగా 88 శాతాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సగానికి పైగా చమురు పశ్చిమాసియా దేశాల నుంచే వస్తోంది. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో 40 నుంచి 50 శాతం కేవలం ఈ హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతోంది. 

ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో, వీలైనంత త్వరగా ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించేందుకు భారత్ చురుగ్గా పావులు కదుపుతోంది.