పెరిగిన వంట నూనెల దిగుమతులు ఫెస్టివల్‌ సీజన్‌ కోసం రెడీ అవుతున్న డీలర్లు

పెరిగిన  వంట నూనెల దిగుమతులు ఫెస్టివల్‌ సీజన్‌ కోసం రెడీ అవుతున్న డీలర్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు నెలలో వంటనూనెల దిగుమతులు భారీగా పెరిగాయి. రాబోయే పండుగ సీజన్​  కోసం తగినన్ని నిల్వలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రిఫైనరీలు వంటనూనెల  దిగుమతులను పెంచుకున్నాయి. ఫలితంగా ఆగస్టు 2023 లో వంటనూనెల దిగుమతులు 5 శాతం పెరిగి 1.85 మిలియన్​ టన్నులకు చేరాయి. వంట నూనెల దిగుమతులు పెరగడం వరసగా ఇది రెండో నెలని డీలర్లు చెబుతున్నారు. ఇండియా కొనుగోళ్లు పెరగడం వల్ల ఇండోనేషియా, మలేషియా దేశాలలో పామాయిల్​ నిల్వలు తగ్గుతున్నాయని, అంతేకాకుండా ఫ్యూచర్స్​ మార్కెట్లో ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

2021–22 లో మన దేశం సగటున నెలవారీగా 1.17 మిలియన్​ టన్నుల వంటనూనెలను దిగుమతి  చేసుకున్నట్లు సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఈఏ) డేటా చెబుతోంది. ఈ ఏడాది జులై  నెలలో దిగుమతులు 1.76 మిలియన్​ టన్నులకు పెరిగాయి. జులైలో  పామాయిల్​ దిగుమతులు 1.09 మిలియన్​ టన్నులు కాగా, ఆగస్టు నాటికి ఇవి మరింత పెరిగి 1.12 మిలియన్​  టన్నులకు చేరాయని డీలర్లు పేర్కొంటున్నారు. పండుగ సీజన్​ కోసం రిఫైనరీలు భారీగా కొనుగోళ్లను జరుపుతున్నారని ఎడిబుల్​ ఆయిల్​ ట్రేడర్​ రాజేష్​ పటేల్​ చెప్పారు. రిటెయిల్​ డిమాండ్​ ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, పండుగ సీజన్​లో ఊపందుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. 

ఏడు నెలల్లో ఎన్నడూ లేనంతగా సన్ ​ఫ్లవర్​ ఆయిల్​ దిగుమతులు 11.5 శాతం పెరిగి 3.65 లక్షల టన్నులకు చేరాయి. సోయా ఆయిల్​ దిగుమతులు కూడా 3.7 శాతం పెరిగాయని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్​లాండ్​ దేశాల నుంచి పామాయిల్​ను, అర్జెంటీనా, బ్రెజిల్​, రష్యా, ఉక్రెయిన్​ దేశాల నుంచి సన్​ఫ్లవర్​ ఆయిల్​ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వర్షపాతం చాలినంతగా లేకపోవడంతో లోకల్​ సోయాబీన్​, వేరుశనగ దిగుబడి తగ్గుతాయనే భయాలు కూడా దిగుమతులు ఎక్కువవడానికి ఒక కారణం. ఎప్పుడూ లేని విధంగా ఆగస్టులో సాధారణం కంటే 36 %  తక్కువ వర్షపాతం రికార్డయింది.