ప్రాక్టీస్ సెషన్స్‌‌కు పొల్యూషన్ సెగ

ప్రాక్టీస్ సెషన్స్‌‌కు పొల్యూషన్ సెగ

    ఢిల్లీ టీ20కి ముందు ఆటగాళ్లు జిమ్‌‌లోనే గడిపేలా ప్రణాళికలు!

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఇండియా–బంగ్లాదేశ్‌‌ టీ20 మ్యాచ్‌‌కు ఇబ్బంది లేకున్నా.. ఆటగాళ్ల ప్రాక్టీస్‌‌ సెషన్‌‌కు మాత్రం కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత ఎయిర్‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్‌‌  రిపోర్ట్‌‌ ప్రకారం ఢిల్లీలో కాలుష్యం ఏమాత్రం మెరుగవ్వలేదు. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌‌ కోసం రోహిత్ సారథ్యంలోని టీమిండియా గురువారం మైదానం చేరనుండగా.. బంగ్లాదేశ్‌‌ బుధవారమే రానుంది. ఇండియాకు శుక్ర,శనివారాల్లో ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ నిర్వహించేందుకు మేనేజ్‌‌మెంట్‌‌ ప్రణాళికను సిద్ధం చేసింది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే  అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఇవి కాస్త ఆప్షనల్‌‌గా మారనున్నాయి.

‘రాత్రి వేళలో జరగనుండటంతో మ్యాచ్‌‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమస్యంతా ట్రైనింగ్‌‌ సెషన్లతోనే వచ్చింది. అయితే ఆటగాళ్లకు ఇదేం కొత్త సీజన్‌‌ కాదు. దీపావళి బ్రేక్ తర్వాత ఫామ్‌‌లో రావడానికి వారికి కొన్ని జిమ్‌‌ సెషన్‌‌లు సరిపోతాయి. వాతావరణ పరిస్థితులపైనే ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌ ఆధారపడి ఉన్నాయి’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ట్రైనింగ్ సెషన్‌‌ టైమింగ్స్‌‌ మార్చాల్చిన పరిస్థితి ఏర్పడిందని ఢిల్లీ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ అధికారులు తెలిపారు. ‘ నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు కళ్లు మండేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయి. గురువారం బంగ్లాదేశ్‌‌కు ట్రైనింగ్ సెషన్‌‌ ఉంది. కానీ వారు పాల్గొంటారనుకోవడం లేదు. అలాగే శనివారం నాటి వారి ప్రాక్టీస్ సెషన్‌‌ టైమింగ్స్‌‌ను కూడా మార్చమని కోరే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్నింగ్ టైమ్​లో  ట్రైనింగ్‌‌ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.

మ్యాచ్ వేదికను మార్చండి

కాలుష్యం తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఆటగాళ్లు, వేల సంఖ్యలోని ప్రేక్షకులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, మ్యాచ్‌‌ వేదికను మార్చాలని పర్యావరణ వేత్తలు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌‌ గంగూలీకి లేఖ రాశారు.