కివీస్పై భారత్ భారీ విక్టరీ..సిరీస్ క్లీన్ స్వీప్

కివీస్పై భారత్ భారీ విక్టరీ..సిరీస్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ప్రత్యర్థిపై 90 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. 386 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్..భారత బౌలర్ల ధాటికి కేవలం 295 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. శుభ్ మన్ గిల్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కగా..శార్దూల్ ఠాకూర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

386 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ దశలో  హెన్రీ నికోలస్, డివాన్ కాన్వేలు జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్కు 106 పరుగులు జోడించారు. అయితే 42 పరుగులు చేసిన నికోలస్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాన్వేకు డారెల్ మిచెల్ జతకలవడంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరు మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో డివాన్ కాన్వే 74 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 

చెలరేగిన శార్దూల్..

లక్ష్యం దిశగా సాగుతున్న న్యూజిలాండ్ను శార్దూల్ ఠాకూర్ దెబ్బకొట్టాడు. 184 పరుగుల వద్ద రెండు వికెట్లు పడగొట్టాడు. డారెల్ మిచెల్తో పాటు.. కెప్టెన్ టామ్ లాథమ్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫిలిప్స్ను పెవీలియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ 205 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో 30 పరుగుల వ్యవధిలో సెంచరీ చేసిన కాన్వేను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. చాహల్ రెండు వికెట్లు తీశాడు. హార్ది్క్ పాండ్యా , ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ఓపెనర్ల సెంచరీలు..

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన  భారత్ 50 ఓవర్లలో 9 ఓవర్లలో 385 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ అద్భుత ఆరంభాన్నిచ్చారు. కివీస్ బౌలర్లను చితక్కొట్టారు. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇదే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో సెంచరీ కొట్టగా..శుభ్ మన్ గిల్ కేవలం 72 బాల్స్ లోనే సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే సెంచరీ చేసిన అనంతరం రోహిత్ శర్మ(101) ఔటయ్యాడు. టిక్నర్‌ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో  భారత్ 212 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే శుభ్ మన్ గిల్ (112)  కూడా పెవీలియన్ చేరడంతో భారత్ 230 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.

టపా టపా..

రోహిత్ శర్మ, గిల్ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ ఔట్తో క్రీజులోకి వచ్చిన వచ్చిన కోహ్లీ సిక్సుతో మాంచి ఊపుమీదున్నట్లు కనిపించాడు. కానీ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో 230 పరుగులకు ఒక వికెట్ తో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా..80 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పయింది. 

హార్దిక్ హాఫ్ సెంచరీ..

ఓ వైపు వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా  సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. శార్దూల్ ఠాకూర్ (25) సహకారంతో భారత్ స్కోరును 350 దాటించాడు. ఇదే క్రమంలో 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న పాండ్యా 379 పరుగుల వద్ద జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కుల్దీప్ 9 వికెట్ గా నిష్క్రమించడంతో  భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది.  కివీస్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, టిక్నర్ మూడు వికెట్ల చొప్పన పడగొట్టారు. బ్రేస్ వెల్ ఒక వికెట్ తీశాడు.