గిల్ సెంచరీ...టీమిండియా సూపర్ విక్టరీ

గిల్ సెంచరీ...టీమిండియా సూపర్ విక్టరీ

మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. కివీన్ పై 168 పరుగుల తేడాతో  గెలుపొందింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. 

7 పరుగులకే 4 వికెట్లు 

235 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 4పరుగుల వద్ద ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..ఆ తర్వాత 5 పరుగుల వద్ద కాన్వే ఔటయ్యాడు. మరో పరుగు వద్ద చాప్మన్ పెవీలియన్ చేరాడు. అనంతరం 7 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్స్ సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 7 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరి కొద్ది పరుగుల వ్యవధిలో కివీస్ మరో వికెట్ నష్టపోయింది. 21 పరుగుల వద్ద బ్రేస్ వెల్ పెవీలియన్ చేరడంతో న్యూజిలాండ్ 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

రాణించిన మిచెల్..

ఈ సమయంలో డారెల్ మిచెల్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ సాంట్నర్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు 6 వికెట్కు 21 పరుగులు జత చేశారు. అయితే ఈ సమయంలో శివమ్ మావి మ్యాజిక్ చేశాడు. వరుసగా సాంట్నర్, ఇష్ సోధీలను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మావి తర్వాత బౌలింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా  ఫెర్గ్యూసన్ , టిక్నర్ను ఔట్ చేశాడు. చివరి వరకు పోరాడిన డార్లీ మిచెల్..ఉమ్రాన్ బౌలింగ్లో చివరి వికెట్గా నిష్క్రమించడంతో  న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది.  భారత బౌలర్లలో పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా...అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు  టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్..20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. ఓ దశలో  భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే  వికెట్ నష్టపోయింది. బ్రేస్ వెల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ LBWగా వెనుదిరిగాడు. ఈ సమయంలో గిల్కు జతకలిసిన రాహుల్ త్రిపాఠి..చిచ్చరపిడుగుల చెలరేగాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. గిల్తో కలిసి రెండో వికెట్కు 80 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలోనే సోధీ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 87 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ..వచ్చి రాగానే సిక్స్ బాదాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 24 పరుగులు చేసిన సూర్య..టిక్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 

గిల్ సెంచరీ..

ఈ సమయంలో శుభ్ మన్ గిల్ చెలరేగాడు. సూర్య ఔటైన తర్వాత రెచ్చిపోయాడు. సిక్సులు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.  కేవలం 35 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. 50 పరుగులు చేశాడు. మరో 19 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 54 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు, 10 ఫోర్లు ఉండటం విశేషం. చివరి వరకు క్రీజులో ఉన్న గిల్..63 బంతుల్లో 126 పరుగులు చేసి భారత్ 234 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.  30 పరుగులు చేసిన పాండ్యా చివర్లో వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, మిచెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.