సౌతాఫ్రికాపై 2–0తో సిరీస్‌‌‌‌ సొంతం

సౌతాఫ్రికాపై 2–0తో సిరీస్‌‌‌‌ సొంతం
  • దుమ్మురేపిన సూర్య కుమార్​, రాహుల్‌‌, కోహ్లీ, రోహిత్‌‌
  •  మిల్లర్‌‌, డికాక్‌‌ పోరాటం వృథా

గౌహతి: బౌండరీల మోత.. సిక్సర్ల జాతరగా సాగిన రెండో టీ20లో ఇండియా ఉత్కంఠ విజయం సాధించింది. భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌లో మిల్లర్‌‌ (47 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్‌‌), డికాక్‌‌(48 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్‌‌) ఆఖరి బాల్‌‌ వరకు వణికించినా.. 16 రన్స్‌‌ తేడాతో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. సూర్యకుమార్‌‌ (22 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61), కేఎల్‌‌ రాహుల్‌‌ (28 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), విరాట్‌‌ కోహ్లీ (28 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 49 నాటౌట్‌‌), రోహిత్‌‌ శర్మ (37 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 43) దంచికొట్టిన వేళ.. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 237/3 స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 221/3 స్కోరుతో పోరాడి ఓడింది. రాహుల్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. సొంతగడ్డలో సౌతాఫ్రికాపై ఇండియాకు ఇది తొలి టీ20 సిరీస్‌‌ విక్టరీ.  

‘టాప్‌‌’ గేర్‌‌..

ఫ్లాట్‌‌ పిచ్‌‌పై ఇండియా టాప్‌‌–4 బ్యాటర్లు దుమ్మురేపిన్రు. ఇన్నింగ్స్‌‌ తొలి బాల్‌‌ను ఫోర్‌‌గా మలిచి రాహుల్‌‌ టచ్‌‌లోకి వచ్చాడు.  రెండో ఓవర్‌‌లో పార్నెల్‌‌ బాల్‌‌ చూపుడు వేలికి బలంగా తాకడంతో కాస్త ఇబ్బందిపడ్డ హిట్‌‌మ్యాన్‌‌.. థర్డ్‌‌ ఓవర్‌‌లో సిక్సర్‌‌తో జోరు పెంచాడు. నాలుగో ఓవర్‌‌లో రాహుల్‌‌ 6, 4, 4తో 15 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ బాదారు. ఆరో ఓవర్‌‌లో కెప్టెన్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లేలో ఇండియా 57/0 స్కోరు చేసింది. నెక్స్ట్‌‌ ఓవర్స్‌‌లో రాహుల్‌‌ 6, 4, 6తో రెచ్చిపోతే రోహిత్‌‌ కూడా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ పదో ఓవర్‌‌లో కేశవ్‌‌ (2/23).. రోహిత్‌‌ను ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 96 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టిన రాహుల్‌‌.. 12 వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన కోహ్లీ, సూర్యకుమార్‌‌ ఓవర్‌‌కు ఒకటి, రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 15వ ఓవర్‌‌లో సూర్య 6, 4, 4, 6తో 22 రన్స్‌‌ పిండుకున్నాడు. 16వ ఓవర్‌‌లోనూ 6, 4, ఆ వెంటనే నో బాల్‌‌ సిక్సర్‌‌తో 18 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ అందుకున్నాడు. అప్పటివరకు నెమ్మదిగా ఉన్న విరాట్‌‌.. 17వ ఓవర్‌‌లో 6, 4, 4తో రెచ్చిపోయాడు. 18వ ఓవర్‌‌లో ఇద్దరు 4, 6 కొట్టినా, 19వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు సూర్య రనౌటయ్యాడు. దీంతో మూడో వికెట్‌‌కు 102 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఇదే ఓవర్‌‌లో కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు కొడితే, లాస్ట్‌‌ ఓవర్‌‌లో కార్తీక్‌‌ (7 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 17 నాటౌట్‌‌) 4, 6, 6తో 18 రన్స్‌‌ రాబట్టాడు. 

మిల్లర్‌‌, డికాక్‌‌ మెరుపులు

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికాకు సరైన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌‌లో అర్ష్‌‌దీప్‌‌ (2/62) నాలుగు బాల్స్‌‌ తేడాలో బవుమా (0), రోసోవ్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. తర్వాత డికాక్‌‌ నెమ్మదిస్తే, మార్‌‌క్రమ్‌‌ (33) జోరందుకున్నాడు. అతను మూడో వికెట్‌‌కు 46 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన మిల్లర్‌‌, డికాక్‌‌తో కలిసి ఇండియా బౌలర్లను ఊచకోత కోశాడు. 11వ ఓవర్‌‌ నుంచి మిల్లర్‌‌ హిట్టింగ్‌‌ దెబ్బకు మ్యాచ్‌‌ టర్న్‌‌ అవుతూ వచ్చింది. ఈ ఓవర్‌‌లో రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌‌లో 6, 6, 4 బాదాడు. 13వ ఓవర్‌‌లో 8 రన్సే రావడంతో అర్ష్‌‌దీప్‌‌ ఊరట చెందినా..14వ ఓవర్‌‌లో సిక్స్‌‌తో మిల్లర్‌‌ జోష్‌‌ తగ్గనీయలేదు. ఇక 15వ ఓవర్‌‌లో డికాక్‌‌ 6, 6, 4తో 18 రన్స్‌‌ సాధించడంతో సఫారీలు 143/3 స్కోరు చేశారు. 16వ ఓవర్‌‌లో మిల్లర్‌‌ రెండు ఫోర్లతో 13 రన్స్‌‌ చేయడంతో.. విజయానికి 24 బాల్స్‌‌లో 82 రన్స్‌‌ అవసరమయ్యాయి. 17, 18వ ఓవర్లలో చహర్‌‌, హర్షల్‌‌ వరుసగా 8, 11 రన్స్‌‌ ఇవ్వడంతో సమీకరణం 12 బాల్స్‌‌లో 63గా మారింది. కానీ 19వ ఓవర్‌‌ (అర్ష్‌‌దీప్‌‌)లో మిల్లర్‌‌ 6, 4, 4, 6తో 26 రన్స్‌‌ దంచడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. లాస్ట్‌‌ ఆరు బాల్స్‌‌లో 37 రన్స్‌‌ అవసరం కాగా.. 3 సిక్సర్లతో సెంచరీ ఫినిష్‌‌ చేసిన మిల్లర్‌‌.. గెలుపుకు కొద్ది దూరంలో ఆగిపోయాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 237/3 (సూర్య 61, రాహుల్‌‌ 57, కోహ్లీ 49, కేశవ్‌‌ 2/23). 
సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 221/3 (మిల్లర్‌‌ 106 *, డికాక్‌‌ 69*, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ 2/62).