మూడో వన్డేలో ఇండియా గెలుపు

మూడో వన్డేలో ఇండియా గెలుపు
  • 2‑1తో సిరీస్‌‌‌‌ సొంతం 
  • రాణించిన గిల్‌‌, శ్రేయస్‌‌ 

న్యూఢిల్లీ: ఇండియా రిజర్వ్‌‌‌‌ బెంచ్‌‌ బలం మరోసారి నిరూపితమైంది. మెయిన్‌‌ టీమ్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌ కోసం ఆస్ట్రేలియాకు వెళ్తే.. కుర్రాళ్లతో కూడిన  జట్టు.. బలమైన సౌతాఫ్రికాను ఓ ఆటాడుకుంది. బౌలింగ్‌‌లో స్పిన్‌‌ త్రయం కుల్దీప్‌‌ యాదవ్‌‌ (4/18), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (2/15), షాబాజ్‌‌ అహ్మద్‌‌ (2/32) రాణించడంతో... మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఇండియా 7 వికెట్ల తేడాతో సఫారీ టీమ్‌‌పై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–1తో కైవసం చేసుకుంది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 రన్స్‌‌కే కుప్పకూలింది. హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (34) టాప్‌‌ స్కోరర్‌‌. మలన్‌‌ (15)తో సహా అందరూ నిరాశపర్చారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 19.1 ఓవర్లలో 105/3 స్కోరు చేసి గెలిచింది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (57 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 49) నిలకడగా ఆడాడు. కుల్దీప్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, సిరాజ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్​’ అవార్డులు లభించాయి. 

బౌలింగ్‌‌ అదుర్స్‌‌
కోట్లా స్లో బౌలింగ్‌‌ ట్రాక్‌‌పై ఇండియన్‌‌ స్పిన్నర్లు సఫారీలను ఓ ఆటాడుకున్నారు. వీళ్లకు హైదరాబాదీ మహ్మద్‌‌ సిరాజ్‌‌ (2/17) కూడా అండగా నిలవడంతో ప్రొటీస్‌‌  కనీసం వంద రన్స్​ కూడా చేయలేకపోయింది. మంచి ఫామ్‌‌లో ఉన్న డికాక్‌‌ (6)ను థర్డ్‌‌ ఓవర్‌‌లోనే సుందర్‌‌ ఔట్‌‌ చేయడంతో మొదలైన వికెట్లపతనం ఎక్కడా ఆగలేదు. ప్రతి బౌలర్‌‌ కచ్చితమైన లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యారు. మలన్‌‌తో పాటు రివ్యూలో బతికిపోయిన రీజా హెండ్రిక్స్‌‌ (3)ను సిరాజ్‌‌ వరుస ఓవర్లలో ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. ఓ ఎండ్‌‌లో క్లాసెన్‌‌ పోరాటం మొదలుపెట్టినా... రెండో ఎండ్‌‌లో మిల్లర్‌‌ (7), మార్‌‌క్రమ్‌‌ (9), ఫెలుక్వాయో (5) వరుస విరామాల్లో ఔట్‌‌కావడంతో సఫారీల స్కోరు 6/71గా మారింది. ఈ దశలో క్లాసెన్‌‌, జెన్‌‌సెన్‌‌ (14).. ఏడో వికెట్‌‌కు 23 రన్స్‌‌ జత చేశారు. 25వ ఓవర్‌‌లో షాబాజ్‌‌.. క్లాసెన్‌‌ను ఔట్‌‌ చేసి ఈ జోడీని విడగొట్టాడు. 26వ ఓవర్‌‌లో కుల్దీప్‌‌ వరుస బాల్స్‌‌లో ఫోర్టున్‌‌ (1), నోర్జ్‌‌ (0), తర్వాతి ఓవర్‌‌లో జెన్‌‌సెన్‌‌ను పెవిలియన్‌‌కు పంపి సఫారీ ఇన్నింగ్స్‌‌కు తెరదించాడు. 

సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 27.1 ఓవర్లలో 99 ఆలౌట్‌‌ (క్లాసెన్‌‌ 34, కుల్దీప్‌‌ 4/18), ఇండియా: 19.1 ఓవర్లలో 105/3 (గిల్‌‌ 49, శ్రేయస్‌‌ 28 నాటౌట్‌‌, ఎంగిడి 1/21). 

అలవోకగా..
పెద్ద టార్గెట్‌ కాకపోవడంతో ఇండియా ఆడుతూ పాడుతూ గెలిచింది. ఏడో ఓవర్‌లో కెప్టెన్‌ ధవన్‌ (8) వికెట్‌ పడినా.. శుభ్‌మన్‌ గిల్‌ ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడాడు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబడుతూ మూడు కీలక భాగస్వామ్యాలతో లక్ష్యాన్ని కరిగించాడు. ధవన్‌తో తొలి వికెట్‌కు 42, ఇషాన్‌ కిషన్‌ (10) తో రెండో వికెట్‌కు 16, శ్రేయస్‌ అయ్యర్‌ (28 నాటౌట్‌)తో కలిసి మూడో వికెట్‌కు 39 రన్స్‌ జత చేసి ఔటయ్యాడు. చివర్లో శ్రేయస్‌, శాంసన్‌ (2 నాటౌట్‌) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. 38అన్ని ఫార్మాట్లలో కలిపి ఓ క్యాలెండర్‌‌‌‌ ఇయర్‌‌లో అత్యధిక విజయాలు (38) సాధించిన ఇండియా.. ఆస్ట్రేలియా (2003లో) రికార్డును సమం చేసింది.