
- ఆ దేశ యాపిల్స్ దిగుమతి బంద్
- పాక్‌కు మద్దతు ఇచ్చినందుకు బహిష్కరిస్తున్న మనోళ్లు
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. పాక్‌కు మద్దతు ఇచ్చిన తుర్కియేపై మనోళ్లు మండిపడుతున్నారు. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ట్రెండింగ్‌లో ఉంది. తుర్కియే తీరుకు నిరసనగా ఆ దేశ యాపిల్స్‌ను బహిష్కరిస్తూ మన దేశ వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. తుర్కియేకు బదులు ఇతర దేశాల నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇరాన్ యాపిల్స్‌కు డిమాండ్ పెరిగింది. 10 కిలోల హోల్‌సేల్ బాక్స్‌పై రూ.200 నుంచి రూ.300 పెరగ్గా, రిటైల్‌లో కిలోకు రూ.20 నుంచి రూ.30 పెరిగింది. తుర్కియే యాపిల్స్‌ను కొనొద్దని నిర్ణయం తీసుకున్నట్టు పుణె వ్యాపారులు ప్రకటించారు. దానికి బదులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘‘తుర్కియేలో భూకంపం వచ్చినప్పుడు మన దేశమే మొదట సాయం చేసింది.
కానీ ఇప్పుడు వాళ్లు పాకిస్తాన్‌కు మద్దతు పలికారు. అందుకే ఆ దేశ యాపిల్స్‌ను బహిష్కరిస్తున్నాం” అని ఓ వ్యాపారవేత్త తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తుర్కియే యాపిల్స్‌ను బహిష్కరిస్తున్నారని చెప్పారు. పుణె మార్కెట్‌లో తుర్కియే యాపిల్ సీజన్ అమ్మకాలు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు ఉంటాయి. ఇప్పుడు వ్యాపారులు వాటిని బహిష్కరించడంతో మార్కెట్‌లో కనిపించడం లేదు. మరోవైపు, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పహల్గాం నుంచి యాపిల్స్ రవాణా నిలిచింది. కాగా, ఈజ్‌మైట్రిప్, ఇక్సిగో లాంటి సంస్థలు తుర్కియేకు విమానాలు, హోటల్ బుకింగ్స్‌ను నిలిపివేశాయి.