
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో పైరసీ, టెర్రరిజంపై పోరుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన తమ వాణిజ్య ఓడను ఇండియన్ నేవీ కాపాడడంతో బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాదెవ్ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలపగా, మోదీ స్పందించారు. ‘మీ పౌరులు క్షేమంగా ఉన్నారు. త్వరలోనే తిరిగొస్తారు’ అని మోదీ రిప్లై ఇచ్చారు. 8 మంది బల్గేరియన్లు, 9 మంది మయన్మార్ పౌరులు, ఒక అంగోలన్ ఉన్న వాణిజ్య నౌక ‘రూయెన్’ను నిరుడు డిసెంబర్లో సోమాలియా దొంగలు హైజాక్ చేశారు. భారత నావికాదళం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, రూయెన్‌ను రక్షించింది. కాగా, ఈ నెల 16న బల్గేరియా విదేశాంగ శాఖ మంత్రి మరియా గాబ్రియెల్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ‘నిరుడు డిసెంబర్లో హైజాక్‌కు గురైన రూయెన్ నౌకను ఇండియా నేవీ రక్షించింది. అందులో ఉన్న నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఇండియన్ నేవీకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.