
దుబాయ్: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కోసం టీమిండియా ప్రిపరేషన్స్ షురూ చేసింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమ్ శుక్రవారం సాయంత్రం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో తొలి ప్రాక్టీస్, నెట్ సెషన్‌లో పాల్గొంది. సూర్య, వైస్ -కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో పాటు ఆటగాళ్లందరూ మొదట ఫిట్‌నెస్ డ్రిల్స్‌లో పాల్గొని, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. మ్యాచ్ పరిస్థితులను అనుకరించేలా (సిమ్యులేషన్) జట్టు తమ నెట్ సెషన్‌ను ప్రారంభించింది.
తొలి బృందంలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మ బ్యాటింగ్ చేయగా, ఆ తర్వాత సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తమ బ్యాటింగ్ నైపుణ్యాలకు పదును పెట్టారు. అంతకుముందు ప్లేయర్లందరికీ కెప్టెన్ సూర్య, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశం చేశారు. కొత్త హెయిర్ స్టయిల్‌తో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా కనిపించాడు. ఈ నెల 9వ తేదీ నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో ఇండియా ప్లేయర్లంతా గురువారం దుబాయ్ చేరుకున్నారు. ఒక రోజు ఆలస్యంగా చేరుకున్నప్పటికీ గిల్ నేరుగా జట్టుతో కలిసి తొలి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో గ్రూప్–ఎలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ నెల 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో పోటీపడనుంది. 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో తలపడనుంది.