
విదేశాంగ వ్యవహారాల మినిస్ట్రీ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భయపెడుతున్న ఈ టైమ్ లో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా ఇండియాలో హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం విమర్శలు చేసింది. ‘2020 సంవత్సరం మే 26న అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలంలో మందిర నిర్మాణం ప్రారంభించడం ఈ దిశగా మరో అడుగనే చెప్పాలి. పాక్ ప్రభుత్వంతోపాటు ప్రజలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు’ అని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ (ఎఫ్ వో) పేర్కొంది. దీనిపై విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఘాటుగా స్పందించారు.
‘పాకిస్తాన్ తనకు సంబంధం లేని విషయంలో అసంబద్ధ ప్రకటనలు చేస్తుండటాన్ని గమనిస్తున్నాం. రికార్డ్స్ ప్రకారం చూస్తే.. మైనారిటీల విషయంలో పాక్ సిగ్గుపడాలి. చివరగా చెప్పేదొక్కటే, నంబర్స్ అబద్ధం చెప్పవు. అవి చెప్పాలనుకున్నా చెప్పలేవు. జ్యుడీషియరీ ప్రకారం.. అది కృతజ్ఞతా ప్రమాణం కాదని పాక్ తప్పక గ్రహించాలి. విశ్వసనీయత, చిత్తశుద్ధి ఉన్న వారిని గుర్తించడం దాయాది దేశానికి కష్టమనిపిస్తుంది. చట్టాల ద్వారా పాలించబడుతున్న ఇండియాలో ప్రతి ఒక్కరికీ, అన్ని విశ్వాసాల వారికీ సమాన హక్కులు ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలంటే పాక్ విదేశాంగ కార్యాలయం తమ సొంత రాజ్యాంగాన్ని చదివితే సరిపోతుంది’ అని అనురాగ్ చెప్పారు.