టీ20 వరల్డ్​ కప్​లో నేడు సౌతాఫ్రికాతో ఇండియా కీలక పోరు

 టీ20 వరల్డ్​ కప్​లో నేడు సౌతాఫ్రికాతో ఇండియా కీలక పోరు

పెర్త్‌‌‌‌ : ఓవైపు ప్రపంచ క్రికెట్‌‌ను శాసిస్తున్న బ్యాటర్లు.. మరోవైపు పేస్‌‌ బౌలింగ్‌‌ను తమ అడ్రెస్‌‌గా మార్చుకున్న బౌలర్లు.. వీరిద్దరి మధ్య టీ20 వరల్డ్‌‌కప్‌‌లో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్‌‌–12లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌‌–2లో ఇండియా, బలమైన సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిచిన జట్టు గ్రూప్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌కు చేరుకోవడంతో పాటు సెమీస్‌‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది. పేసర్లకు స్వర్గధామం అయిన ‘వాకా’ స్టేడియం ప్లేస్‌‌లో కొత్తగా నిర్మించిన ‘అప్టస్‌‌’ గ్రౌండ్​లో  ఈ మ్యాచ్‌‌ కోసం పచ్చికతో కూడిన బౌన్సీ వికెట్‌‌ రెడీగా ఉన్నది. ప్రస్తుత ఫామ్‌‌, లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌‌లో రోహిత్‌‌సేన ఫేవరెట్‌‌గా దిగుతున్నా.. సఫారీ పేస్‌‌ త్రయం రబాడ, నోర్జ్‌‌, ఎంగిడి నుంచి కఠిన సవాల్​ ఎదురుకానుంది. మరి మనోళ్లు ఈ పరీక్షలో పాస్‌‌ అయ్యి మరో అడుగు ముందుకేస్తారా? లేదా? చూడాలి. 

విన్నింగ్​ కాంబినేషన్​తోనే..

గత రెండు మ్యాచ్‌‌ల్లో ఆడిన విన్నింగ్​ కాంబినేషన్​ను కొనసాగించాలని ఇండియా భావిస్తోంది.  ఓపెనింగ్‌‌లో రాహుల్‌‌ను లేదా కీపర్​  కార్తీక్‌‌ను డ్రాప్‌‌ చేసి రిషబ్‌‌ను తీసుకుంటే లెఫ్ట్​–రైట్​ హ్యాండ్​ కాంబినేషన్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా ద్రవిడ్‌‌ దీనికి సుముఖంగా లేడని సమాచారం.  రోహిత్‌‌, కోహ్లీ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నా.. టాపార్డర్‌‌లో కీలకమైన కేఎల్‌‌ రాహుల్‌‌ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌‌లో నూ ఫెయిలైతే తను  బెంచ్‌‌కు పరిమితంకాక తప్పదు. తొలి పది ఓవర్లలో రబాడ, నోర్జ్‌‌ను ఎదుర్కొని మన టాపార్డర్​ నిలబడితే భారీ స్కోరు వస్తుంది.  మిడిల్‌‌ ఓవర్స్‌‌లో మ్యాచ్‌‌ను నిలబెట్టడంలో సూర్యకుమార్‌‌కు తిరుగులేదు. గత మ్యాచ్​ ఫామ్‌‌ను కొనసాగిస్తే సఫారీలకు ఇబ్బందులు తప్పవు. అయితే పిచ్‌‌ మీద ఎక్స్‌‌ట్రా పేస్‌‌ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో టాప్​4 రాణిస్తేనే విజయం సులువు అవుతుంది. లైనప్‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ను ప్రమోట్‌‌ చేసి ఫించ్‌‌ హిట్టర్‌‌గా ఉపయోగించుకోవాలని టీమ్​ భావిస్తోంది. దీంతో హార్దిక్‌‌, కార్తీక్‌‌ ఫినిషర్లుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే  ఇండియాకు తిరుగుండదు. బౌలింగ్‌‌లో భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌ డెత్‌‌ ఓవర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మిడిల్‌‌ ఓవర్స్‌‌లో షమీ, స్పిన్నర్లు అక్షర్‌‌, అశ్విన్‌‌ సత్తా చాటడం కలిసొచ్చే అంశం. 

వాళ్లతోనే ప్రమాదం..

ఈ మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్‌‌ కంటే బౌలింగ్‌‌తోనే ఇండియాకు ఎక్కువ ప్రమాదం ఉంది. బౌన్సీ పిచ్‌‌ కావడంతో నిలకడగా 150 ప్లస్‌‌ స్పీడ్‌‌తో బాల్​ను స్వింగ్‌‌ చేసే రబాడ, ఇంతే వేగంతో హార్డ్‌‌, ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్స్​  వేసే నోర్జ్‌‌.. సఫారీ జట్టుకు అతిపెద్ద బలం. వీళ్లకు తోడుగా ఎంగిడి, పార్నెల్‌‌ కూడా ప్రభావం చూపిస్తే ఇండియాకు ఇక్కట్లు తప్పవు.  ఏకైక స్పిన్నర్‌‌గా కేశవ్‌‌ కచ్చితంగా తన మార్క్‌‌ చూపెడతాడని ఆశిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌‌లో బవూమ వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతున్నది. ఆరంభంలో డికాక్‌‌, రొసో మెరుపులు స్కోరును ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇండియన్‌‌ పేసర్లు వీళ్లను నిలువరించినా..మార్‌‌క్రమ్‌‌, మిల్లర్‌‌, స్టబ్స్‌‌ నుంచి కూడా ముప్పు పొంచి ఉంటుంది. ఈ ముగ్గురు ఎప్పుడు ఎలా చెలరేగుతారో కూడా తెలియదు. ఇప్పటికే ఇండియాతో సిరీస్‌‌లో మిల్లర్‌‌ తన బ్యాటింగ్‌‌ విశ్వరూపం చూపెట్టాడు. మొత్తానికి బౌలింగ్‌‌ బలంతో పాటు బ్యాటింగ్‌‌లోనూ సఫారీలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 

జట్లు (అంచనా) 

ఇండియా: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), రాహుల్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, అక్షర్‌‌, పాండ్యా, కార్తీక్‌‌, అశ్విన్‌‌, షమీ, భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌.

సౌతాఫ్రికా: బవూమ (కెప్టెన్‌‌), డికాక్‌‌, రొసో, మార్‌‌క్రమ్‌‌, మిల్లర్‌‌, స్టబ్స్‌‌, పార్నెల్‌‌ / జెన్‌‌సెన్‌‌, కేశవ్‌‌, నోర్జ్‌‌, ఎంగిడి, రబాడ.