భారత్కు కావాల్సింది విప్లవం కాదు.. పరిణామం

భారత్కు కావాల్సింది విప్లవం కాదు.. పరిణామం

న్యూఢిల్లీ: మన దేశానికి ఇప్పుడు కావాల్సింది విప్లవం కాదని.. పరిణామం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లే క్రమంలో దేశ చరిత్రను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆలిండియా మేయర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వర్చువల్ కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న మోడీ పైవ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేసే క్రమంలో మన చరిత్రతోపాటు అవసరమైన ప్రతి దాన్ని సురక్షితంగా భద్రపర్చాలన్నారు. 

‘మన దేశంలోని నగరాల్లో చాలా మటుకు సంప్రదాయాక సిటీలనే చెప్పాలి. ఇవి ట్రెడీషనల్ గా అభివృద్ధి చెందాయి. ఈ ఆధునిక యుగంలో ఇలాంటి నగరాల ప్రాచీనత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం’ అని మోడీ వ్యాఖ్యానించారు. సిటీల నుంచి పోయే నదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రతి ఏడాది కనీసం ఏడు రోజులు రివర్ ఫెస్టివల్ జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుకల్లో సిటీల్లోని ప్రజలందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.