భారత జీడీపీని 6.9శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్

భారత జీడీపీని 6.9శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్

న్యూఢిల్లీ: గ్లోబల్​ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోందని ప్రపంచబ్యాంకు మెచ్చుకుంది. జీడీపీ గ్రోత్​రేటును పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 6.9 శాతం ఉండొచ్చని ప్రకటించింది. రెండో క్వార్టర్​లో గ్రోత్​ ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉందని ప్రశంసించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2022–-23 సెప్టెంబర్ క్వార్టర్​లో 6.3 శాతం పెరిగింది. ఇది అంతకుముందు జూన్ క్వార్టర్​లో 13.5 శాతంగా ఉంది. ప్రధానంగా తయారీ,  మైనింగ్ రంగాల ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా ఇది పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం నేపథ్యంలో ఒక గ్లోబల్​ ఏజెన్సీ భారతదేశ వృద్ధి అంచనాను అప్‌‌‌‌గ్రేడ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో  ప్రపంచ బ్యాంకు భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను  7.5 శాతం నుండి 6.5 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని 2022 – 23  ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతానికి అప్‌‌‌‌గ్రేడ్ చేసినట్టు ‘నావిగేటింగ్ ది స్టార్మ్' పేరుతో ఇది రూపొందించిన రిపోర్టు  పేర్కొంది. దీని ప్రకారం.. గ్లోబల్​ మార్కెట్లో మాంద్యం భారతదేశ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపుతుంది.

ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం ప్రభావాన్ని బాగానే ఎదుర్కొంటున్నది. గ్లోబల్ మానిటరీ పాలసీ సైకిల్‌‌‌‌ను కఠినతరం చేయడం, గ్లోబల్ వృద్ధి మందగించడం, కమోడిటీ ధరల పెరుగుదల వల్ల 2021–-22 (8.7 శాతం)తో పోలిస్తే 2022–-23లో భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ వృద్ధిని సాధిస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారతదేశం ఆశించిన ఫలితాలను అందుకుంటుంది.  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో (జూలై–-సెప్టెంబర్) భారతదేశం సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకొని ప్రస్తుత అంచనాను మార్చింది. " గ్లోబల్​ మార్కెట్ల నుంచి వస్తున్న ఆటుపోట్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటోంది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో, ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత స్థూల ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది" అని భారతదేశంలోని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే అన్నారు. గ్లోబల్​మార్కెట్ల మాంద్యం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి  నిరంతరం అప్రమత్తత అవసరమని ఆయన హెచ్చరించారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం

202 3– 24లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6 శాతమే వృద్ధి చెందుతుందని ప్రపంచబ్యాంకు రిపోర్టు అంచనా వేసింది.  "ఇంటర్నేషనల్​ మార్కెట్లలో సమస్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. చాలా ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల భారీ పోర్ట్‌‌‌‌ఫోలియో అవుట్‌‌‌‌ఫ్లోలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గింది. అంతర్జాతీయంగా వస్తువుల ధరల పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా లోటు పెరిగింది"అని ప్రపంచబ్యాంకు వివరించింది.  భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్‌‌‌‌ ఉంది కాబట్టి  మాంద్యాన్ని తట్టుకుంటున్నదని పేర్కొంది. యూఎస్​ , యూరప్​,  చైనా మార్కెట్లలో మాంద్యం వల్ల కొంత నష్టం ఉంటుందని స్పష్టం చేసింది. యుఎస్‌‌‌‌లో వృద్ధిలో 1 శాతం పాయింట్ తగ్గుదల భారతదేశ వృద్ధిలో 0.4 శాతం వరకు ఉంటుంది. 

నిర్ణయాలు భేష్​

ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో కేంద్రం తీసుకున్న చర్యలు కూడా కీలక పాత్ర పోషించాయి. మార్కెట్ లోన్లపై ఆధారపడటం వల్ల ఆర్థిక విధానంలో పారదర్శకత పెరిగింది. ఆర్థిక రంగంలో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం తెచ్చిన మార్పులు ఫలితాలను ఇచ్చాయి.  కొత్త    దివాలా కోడ్‌‌‌‌ను ప్రవేశపెట్టడం, కొత్త నేషనల్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌‌‌‌ను రూపొందించడం- వల్ల గడచిన ఐదేళ్లలో ఫైనాన్షియల్​ సెక్టార్​ మరింత బలంగా మారింది. ఇలాంటి చర్యల వల్ల మొండి బకాయిలూ తగ్గుతాయి. భారత ప్రభుత్వం 2022-23లో జీడీపీలో 6.4 శాతం ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్​ఫ్లేషన్​ 7.1 శాతంగా ఉంటుందని, 2023-24లో 5.2 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇన్​ఫ్లేషన్​పై అంతర్జాతీయ చమురు ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకం,  ఇతర పన్నులను తగ్గించిందని ప్రపంచబ్యాంకు పేర్కొంది.