నేడు ఇండియా, ఇంగ్లండ్ ఫైనల్‌ ఫైట్‌!

నేడు ఇండియా, ఇంగ్లండ్ ఫైనల్‌ ఫైట్‌!
  • ఇండియా, ఇంగ్లండ్‌‌ ఐదో టీ20
  • గెలిచిన టీమ్‌‌దే సిరీస్‌‌.. రాత్రి 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో  

టాస్‌‌ గెలిస్తే మ్యాచ్‌‌ గెలిచినట్టే.. ఇండియా- ఇంగ్లండ్‌‌ టీ20 సిరీస్‌‌లో మూడో మ్యాచ్‌‌ వరకూ అంతా ఈ ఫార్ములాకు ఫిక్స్‌‌ అయిపోయారు. కానీ,  అలాంటి పరిస్థితిని దాటుకుని గత మ్యాచ్‌‌లో టార్గెట్‌‌ను డిఫెండ్‌‌ చేసుకున్న కోహ్లీసేన.. ఇంగ్లిష్​ టీమ్‌‌కు దిమ్మతిరిగే  షాకిచ్చింది.  సిరీస్‌‌ లెక్కను 2-2తో సరి చేసింది.  దీంతో ఇరుజట్ల మధ్య నేడు జరిగే ఐదో టీ20 మ్యాచ్​... సిరీస్‌‌ విన్నర్‌‌ను డిసైడ్‌‌ చేయనుంది. దూకుడే మంత్రంగా చెలరేగుతున్న  టీమిండియా జోష్‌‌ కొనసాగిస్తుందా.. వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ టీమ్‌‌కు మరోసారి షాకిస్తుందా..?  ఫైనల్‌‌ ఫైట్‌‌లో గెలిచి  సిరీస్‌‌ పట్టేస్తుందా?  

అహ్మదాబాద్‌‌: చాలెంజింగ్‌‌ కండిషన్స్‌‌కు ఎదురెళ్లి గత మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌కు భారీ షాకిచ్చిన టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇండియా, ఇంగ్లండ్‌‌ మధ్య చివరి, ఐదో టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. నాలుగు మ్యాచ్‌‌లు ముగిసే సరికి ఇరుజట్లు తలో రెండు మ్యాచ్‌‌లు గెలవడంతో సిరీస్‌‌ 2–2తో సమంగా ఉంది. దీంతో ఈ పోరు సిరీస్‌‌ విజేతను తేల్చే ఫైనల్‌‌ ఫైట్‌‌గా మారింది. మరోపక్క టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు కోర్‌‌ టీమ్‌‌ను సెలెక్ట్‌‌ చేసుకునేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్‌‌ మరింత కీలకం కానుంది.  అంతేకాక ఈ మ్యాచ్‌‌లో గెలిచి వన్డే సిరీస్‌‌కు ఫుల్‌‌ కాన్ఫిడెన్స్‌‌తో వెళ్లాలని టార్గెట్‌‌ పెట్టుకున్నాయి. 

దూకుడే టీమిండియా మంత్రం..

టీమిండియా ఈ సిరీస్‌‌లో మునుపెన్నడూ లేనంత దూకుడుగా ఆడుతోంది. డేరింగ్‌‌ గేమ్‌‌తో గ్రౌండ్‌‌లో చెలరేగుతోంది. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా జట్టుగా మంచి పెర్ఫామెన్స్‌‌లు ఇస్తోంది. గత మ్యాచ్‌‌లో టార్గెట్‌‌ను డిఫెండ్‌‌ చేసుకోవడంతో కాన్ఫిడెన్స్‌‌ మరింత పెరిగింది.  ఐదో టీ20లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అలాగని ఇంగ్లండ్‌‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం జరిగే ప్రమాదముంది. ఇక, ఫైనల్‌‌ ఎలెవన్‌‌  విషయానికొస్తే ఓపెనింగ్‌‌లో తప్ప ఇండియాకు పెద్దగా సమస్యల్లేవు. రోహిత్‌‌ శర్మ, కేఎల్‌‌ రాహుల్‌‌ ఉమ్మడిగా హిట్‌‌ అవ్వడం జట్టుకు అత్యవసరం. ముఖ్యంగా రాహుల్‌‌ ఫెయిల్యూర్‌‌ టీమ్‌‌ను బాగా ప్రభావితం చేస్తోంది. అయితే, గాయం కారణంగా లాస్ట్‌‌ మ్యాచ్‌‌కు దూరమైన ఇషాన్‌‌ కిషన్‌‌కు మరో చాన్స్‌‌ ఇస్తారో లేదో చూడాలి. కిషన్‌‌ను ఆడించాలంటే ఫామ్‌‌లో లేని రాహుల్‌‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ముంబై ఇండియన్స్‌‌ ప్లేయర్లు రోహిత్‌‌, కిషన్‌‌ ఇన్నింగ్స్‌‌ స్టార్ట్‌‌ చేస్తారు. ఇక, గత మ్యాచ్‌‌లో వన్‌‌డౌన్‌‌లో వచ్చి సూపర్‌‌ హిట్‌‌ అయిన సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ మరోసారి కీలకం కానున్నాడు. తమ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌ల్లోనే సూర్యతోపాటు, కిషన్‌‌ తమ ఆటతో జట్టుకు మంచి బ్యాలెన్స్‌‌ తీసుకొచ్చారని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీతోపాటు రిషబ్‌‌ పంత్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ కూడా మంచి ఫామ్‌‌లో ఉండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. అయితే, హార్దిక్‌‌ పాండ్యా నుంచి టీమ్‌‌ మరింత ఆశిస్తోంది. పాండ్యా ఈ సిరీస్‌‌లో ఇప్పటిదాకా తన మార్కు ధనాధన్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడలేదు. ఇక, బౌలింగ్‌‌లోనూ ఇండియా చాలా ఇంప్రూవ్‌‌ అయ్యింది. సీనియర్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ నిలకడగా బౌలింగ్‌‌ చేస్తుండగా శార్దూల్‌‌ ఠాకూర్‌‌ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యర్థిపై దాడి చేస్తున్నాడు. చహల్‌‌కు బదులుగా లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఆడి మెప్పించిన స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్ ప్లేస్‌‌ను నిలబెట్టుకునే చాన్సుంది. ఈ మ్యాచ్‌‌లో  స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ తెవాటియాకు చాన్స్‌‌ ఇవ్వాలంటే  సుందర్‌‌ను పక్కనబెట్టాలి. ఇక, లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో హార్దిక్‌‌ బౌలింగ్‌‌లో హిట్‌‌ అవ్వడం జట్టుకు మరింత ప్లస్‌‌. ఫిట్‌‌నెస్‌‌ టెస్ట్‌‌ పాసైన లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ నటరాజన్‌‌ను సర్‌‌ప్రైజ్‌‌ ప్యాకేజ్‌‌గా బరిలోకి దింపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఒత్తిడిలో ఇంగ్లండ్‌‌

టీమిండియా మాదిరిగానే  సిరీస్‌‌ను టీ20 వరల్డ్‌‌కప్‌‌ ప్రిపరేషన్‌‌గా భావిస్తున్న ఇంగ్లండ్‌‌ చివరి మ్యాచ్‌‌లో కాస్త ఒత్తిడితో బరిలోకి దిగనుంది. పరిస్థితులు ఛేజింగ్‌‌కు అనుకూలంగా ఉన్నా గత మ్యాచ్‌‌లో ఆ జట్టు లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోవడమే ఇందుకు కారణం. అయినప్పటికీ తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండానే ఇంగ్లండ్‌‌  బరిలోకి దిగొచ్చు. టాపార్డర్‌‌లో జోస్‌‌ బట్లర్‌‌, డేవిడ్‌‌ మలన్‌‌ నుంచి జట్టు మరింత ఆశిస్తోంది.  మంచి స్టార్ట్‌‌ దొరికినప్పటికీ కీలక సమయంలో వికెట్లు ఇచ్చుకుంటూ బట్లర్‌‌, మలన్‌‌ తమ టీమ్‌‌ను ఒత్తిడిలోకి నెడుతున్నారు. జేసన్‌‌ రాయ్‌‌ కూడా  భారీ ఇన్నింగ్స్‌‌ బాకీ ఉన్నాడు. బెన్‌‌ స్టోక్స్‌‌ ఫామ్‌‌లోకి రావడం ఇంగ్లండ్‌‌కు గుడ్‌‌న్యూస్‌‌.  అయితే, సిరీస్‌‌ డిసైడర్‌‌ మ్యాచ్‌‌ కావడంతో ఇంగ్లండ్‌‌ కూడా ఇద్దరు స్పిన్నర్ల  ప్లాన్‌‌కు వెళ్తుందేమో చూడాలి. అదే జరిగితే ఆదిల్‌‌ రషీద్‌‌తోపాటు మొయిన్‌‌ అలీ కూడా బరిలోకి దిగుతాడు. అప్పడు సామ్‌‌ కరన్‌‌ బెంచ్‌‌కు పరిమితం కావాలి. ఇక, పేసర్లు జోఫ్రా ఆర్చర్‌‌, క్రిస్‌‌ జోర్దాన్‌‌, మార్క్‌‌ వుడ్‌‌తోపాటు బెన్‌‌ స్టోక్స్‌‌ ఇండియన్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను బాగానే కట్టడి చేస్తున్నారు. కీలక టైమ్‌‌లో వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌‌ ఇస్తున్నారు.