
ఆసీస్తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ కు ఒక పరుగు అధిక్యం దక్కింది. 21/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు లంచ్ బ్రేక్ ముందు భారీ షాక్ తగిలింది. నాథన్ లైయన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదటగా కేఎల్ రాహుల్ (17) ఔట్ కాగా ఆ తరువాత రోహిత్ శర్మ (32) ఈ సారి అర్ధ శతకం కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కాసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా ఔటయ్యాడు. దీంతో 66 పరుగులకే టీమిండియా 4 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ(44), రవీంద్ర జడేజా(26) జట్టును ఆదుకున్నారు.ఇద్దరు మరో వికెట్ పడకుండా ఆడుతూ వచ్చారు. ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాక వీరి జోడీకి బ్రేక్ పడింది. ముందుగా జడేజా ఔట్ కాగా, ఆ తరువాత కోహ్లీ వెనుదిరిగాడు. ఆతరువాత క్రీజ్ లోకి వచ్చిన శ్రీకర్ భరత్(6) కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆల్‌రౌండర్లు అక్షర్ (74), అశ్విన్ (37) పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ ఒక్కడే ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసింది.