30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమ కోసం స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. మంగళవారం (అక్టోబర్ 28) హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన సీఎంకు సినీ కార్మికుల అభినందన సభలో మాట్లాడిన సీఎం.. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్ కు స్థలం కేటాయిస్తామన్నారు. కర్ణుడు ప్రాణం పోయినా మిత్ర ధర్మం వదలలేదని, అలాగే మీకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
మూవీ ఇండస్ట్రీని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణరైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. సినీ కార్మికులు అండగా ఉంటే.. హాలీవుడ్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా నగర్ లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించే బాధ్యత తీసుకుంటానని హమీఇచ్చారు. అదే విధంగా ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు.
