చాబహార్ పోర్టుపై భారత్‌‌‌‌కు ఊరట..అమెరికా ఆంక్షల నుంచి మరో ఆరు నెలలు మినహాయింపు

చాబహార్ పోర్టుపై భారత్‌‌‌‌కు ఊరట..అమెరికా ఆంక్షల నుంచి మరో ఆరు నెలలు మినహాయింపు

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌లోని చాబహార్ పోర్టు విషయంలో మన దేశానికి ఊరట లభించింది. అమెరికా విధించిన ఆంక్షల నుంచి మరో ఆరు నెలల పాటు మినహాయింపు దొరికింది. దీంతో ఈ పోర్టులోని షాహిద్ బెహెస్టీ టెర్మినల్‌‌‌‌ అభివృద్ధి, నిర్వహణకు వీలు కలుగుతుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

చాబహార్ పోర్టు ప్రాజెక్టులో మన దేశం భారీగా పెట్టుబడులు పెడుతున్నది. ఇందులోని షాహిద్ బెహెస్టీ టెర్మినల్‌‌‌‌ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి ఇరాన్‌‌‌‌తో పదేండ్ల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సెంట్రల్ ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌‌‌‌తో భారత్ వాణిజ్యం చేయడానికి ఈ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. అలాగే పాకిస్తాన్‌‌‌‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్‌‌‌‌కు మానవతా సాయం అందించేందుకు ఈ పోర్టు కీలకంగా మారింది. 

అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నేపథ్యంలో ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. ఏ దేశమైనా, సంస్థ అయినా ఇరాన్‌‌‌‌తో వ్యాపార లావాదేవీలు జరపకూడదని యూఎస్ హెచ్చరించింది. ఈ ఆంక్షల నుంచి ఇంతకుముందే భారత్‌‌‌‌కు మినహాయింపు ఇచ్చిన అమెరికా.. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించింది. మరోవైపు అమెరికాతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌పై చర్చలు జరుగుతున్నాయని రణధీర్ జైస్వాల్ తెలిపారు. 

‘‘అమెరికాతో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌ను ఫైనల్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా అప్‌‌‌‌డేట్ ఉంటే చెప్తాం. రష్యన్ ఆయిల్ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంపైనా అధ్యయనం చేస్తున్నాం” అని జైస్వాల్​ పేర్కొన్నారు.