
- సాగర్ మాత’ సదస్సు కోసం అందజేత
ఖాట్మండు: నేపాల్ నిర్వహించనున్న ‘సాగర్ మాత సంబాద్’ సదస్సును సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం ఆ దేశానికి 15 ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో జరిగిన కార్యక్రమంలో నేపాల్ రాయబారి నవీన్ శ్రీవాస్తవ 15 ఎలక్ట్రిక్ వాహనాలను నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాకు బహూకరించారు. సదస్సుకు హాజరయ్యే అతిథులు, అధికారుల రాకపోకలను ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సదస్సు కోసం భారత్ అందించిన సహకారానికి విదేశాంగ మంత్రి దేవుబా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో నేపాల్, విదేశాల నుంచి వాతావరణ నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, మీడియా సిబ్బందితో సహా దాదాపు 300 మంది పాల్గొననున్నారు. నేపాల్ ప్రభుత్వం మే 16 నుంచి 18 వరకు ‘క్లైమేట్ చేంజ్, మౌంటెన్స్ అండ్ ద ప్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అంశంపై ఖాట్మండులో ‘సాగర్‌మాత సంబాద్’ సదస్సును నిర్వహించనుంది.