న్యూఢిల్లీ: ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో దేశంలో ఇంధన కొరత రాబోతుందంటూ జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశంలో ఇంధన పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని.. ప్రభుత్వం దగ్గర ముడి చమురు, సహజ వాయువు, ఎల్‌పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అస్థిరత.. అమెరికా-ఇరాన్‌ల మధ్య మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణల దృష్ట్యా పౌరులు ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని సూచించింది. పౌరులు భయాందోళనలకు గురై ప్యానిక్ బయ్యింగ్ చేయొద్దని సూచించింది.
సోమవారం (మే 11) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్యక్షతన పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులపై అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఉ ద్రిక్తతల వల్ల ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలగడం వల్ల చమురు ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అయితే భారతదేశంలోని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. గృహ వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరాలు కొనసాగుతున్నాయి వెల్లడించారు. గత మూడు రోజుల్లో కోటి 14 లక్షల బుకింగ్‌లకు గాను కోటి 26 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేశామని తెలిపారు. అదేవిధంగా.. గత మూడు రోజుల్లో వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు 17,000 టన్నులను దాటాయని.. ఆటో ఎల్పీజీ అమ్మకాలు కూడా 762 టన్నులను అధిగమించాయని వివరించారు.
ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని.. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఇంధన సరఫరాలు కొనసాగేలా చూసేందుకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇంధనాన్ని ఆదా చేసే ప్రత్యమ్నాయాలపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. సాధ్యమైనంత వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సంక్షోభం దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
