ఉత్తర కొరియా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగాలను ఖండించిన భారత్‌

ఉత్తర కొరియా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగాలను ఖండించిన భారత్‌

న్యూయార్క్ : ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలను భారత్‌ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ప్రయోగాలతో శాంతి, భద్రతలను ప్రభావితం చేస్తుందని యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్యోంగ్యాంగ్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టిన తర్వాత యూఎన్‌ భద్రతా మండలి డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాపై సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి. ఇటీవల ఉత్తర కొరియా మిస్సైల్‌ను ప్రయోగించగా.. అధ్యక్షుడు కిమ్‌ తన భార్య, కూతురుతో కలిసి బాలిస్టిక్‌ మిస్సైల్‌ టెస్ట్‌ను పరిశీలించారు. శత్రువులు బెదిరింపులు కొనసాగితే.. ప్రభుత్వం అణ్వాయుధాలతో ఎదుర్కొంటామని ప్రకటించాడు. ఈ క్రమంలో భద్రతా మండలి సమావేశం కాగా.. భారత్‌ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ పాల్గొన్నారు.

అణు, క్షిపణి సాంకేతికత విస్తరణ ఆందోళన కలిగించే విషయమని రుచిరా కాంబోజ్ అన్నారు. అవి దేశంలో శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి ఐక్యంగా ఉండగలవని ఆశిస్తున్నామన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి, భద్రత దిశగా అణు నిరాయుధీకరణకు భారత్‌ నిరంతర మద్దతును అందిస్తుందన్నారు.