సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్దేలో టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ వేసినట్టు తేలడంతో మ్యాచ్ ఫీజ్ లో 10 శాతం జరిమానా విధించింది. రాయ్ పూర్ వేదికగా బుధవారం (డిసెంబర్ 3) జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 358 పరుగుల భారీ స్కోర్ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టీమిండియాకు షాక్ ఇస్తూ ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్ణీత సమయానికి మ్యాచ్ ను ముగించలేకపోయాడు. సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే 2 ఓవర్లు ఆలస్యం అయినట్టు తేలింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుపై జరిమానా విధించాల్సి వచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ చేయలేదు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాటు జరిమానాతో భారత జట్టు కాస్త నిరాశలో కనిపిస్తోంది. మ్యాచ్ 10 గంటలకు మిగియాల్సి ఉంది. కానీ రాహుల్ బౌలింగ్, ఫీల్డింగ్ లో మార్పులు కారణంగా ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ 10:10కి ముగిసింది. ఈ మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా చివరి వన్డేలో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. జైశ్వాల్ సెంచరీతో పాటు కుల్దీప్, ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రాణించి భారత జట్టుకు విజయాన్ని అందించారు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డే విషయానికి వస్తే టీమిండియా భారీ స్కోర్ చేసి ఓడిపోయింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించినా.. బౌలింగ్ లో ఘోరంగా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. మార్కరం (110) సెంచరీకి తోడు మాథ్యూ బ్రీట్జ్కే (68), డేవాల్డ్ బ్రేవీస్ (54) హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికాకు విజయం అందించారు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. కోహ్లీ (102), గైక్వాడ్ (105) సెంచరీలు వృధా అయ్యాయి.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో 359 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నంలో జరిగితే టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ గెలుచుకుంది.
