ఇండియా, ఇరాన్ బంధం ఇప్పటిది కాదు..ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మజీద్

ఇండియా, ఇరాన్ బంధం ఇప్పటిది కాదు..ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మజీద్
  • 3 వేల ఏండ్ల క్రితమే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు
  • ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మజీద్

న్యూఢిల్లీ: భారత్–ఇరాన్ దేశాల మధ్య సంబంధం నిన్న, మొన్నటిదికాదని, అది 3 వేల ఏండ్ల క్రితమే మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. ఇస్లాం ఆవిర్భావానికి వందల ఏండ్ల ముందునుంచే ఇరుదేశాల మధ్య సత్సంబంధాలున్నాయని తెలిపారు. 

శనివారం ఢిల్లీలో ఓ మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌‌–ఇరాన్ రిలేషన్‌‌షిప్‌‌పై మజీద్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు తాత్విక గ్రంథాలను ఇరాన్ ప్రజలు ఎంతో ఆసక్తిగా చదువుతారని  పేర్కొన్నారు. 

భారతీయ విజ్ఞానానికి ఇరాన్‌‌ ఫిదా అయిందని, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రంలాంటి రంగాల్లో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలను ఇరాన్ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన చెప్పారు.

 ‘‘ఇస్లాం రాకముందే మేం భారతీయ తత్వశాస్త్ర గ్రంథాలను అనుసరించాం. నేటికీ మా విశ్వవిద్యాలయాల్లో మీ దేశ విజ్ఞానాన్ని, నాగరికతను ఒక పాఠంగా చదువుకుంటున్నాం” అని చెప్పారు.

చాబహార్ ఓ అద్భుతం..

చాబహార్ ఓ అద్భుతమని, ఈ పోర్ట్​ విషయంలో ఇరు దేశాలు ఎంతో సామరస్యంగా పనిచేస్తాయని మజీద్ హకీమ్ ఇలాహి ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమేనీ ఎప్పుడూ భారత్‌‌తో సత్సంబంధాలనే కోరుకుంటారని, ఈ ప్రాజెక్ట్ ఇరు దేశాల అభివృద్ధికి కీలకం కానుందని పేర్కొన్నారు.

 ఇరాన్‌‌పై విదేశీ ఆంక్షల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కట్టుకథేనని ఆయన కొట్టిపారేశారు.